Chanakya Niti: ఈ నాలుగు ప్రదేశాల్లో సిగ్గు పడితే జీవితంలో విజయం కలే అంటున్న చాణక్య
ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు. అయితే జీవితంలో సక్సెస్ అందుకోవాలంటే ఈ నాలుగు విషయాలలో వెనుకాడవద్దు. అయితే కొంతమంది జీవితంలో చేసే కొన్ని తప్పులు విజయాన్ని దూరం చేస్తాయి. చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి ఈ నాలుగు విషయాలలో ఎటువంటి సంకోచ పడవద్దు. అంతేకాదు అవమానంగా భావించ వద్దు. కొని చోట్ల సంకోచిస్తే తాను అనుకున్నట్లు జీవించలేడు. కనుక చాణక్యుడి చెప్పిన ఆ నాలుగు విషయాలు ఏమిటి తెలుసుకుందాం..
అందరూ ఒకేలా ఉండరు. ఒకొక్కరు ఒకొక్కలా భిన్నంగా ఉంటారు. కొంతమంది తమ మనసులోని మాటను సూటిగా చెప్పగలిగే వ్యక్తిత్వం కలిగి ఉంటారు, మరికొందరు సంకోచిస్తారు. ఇదే విషయంపై ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలను తన నీతి శాస్త్రంలో వివరించాడు. ఒక వ్యక్తి స్వభావం ఏదైనా కావచ్చు.. కానీ ఈ నాలుగు ప్రదేశాలలో లేదా విషయాలలో వెనుకాడకూడదు. ఈ విషయాలపై సూటిగా మాట్లాడే వ్యక్తి తన జీవితంలో విజయం సాధించగలడని పేర్కొన్నాడు.
డబ్బు అప్పుగా ఇస్తే: ఆచార్య చాణక్యుడు ప్రకారం సంపదకు సంబంధించిన విషయాల గురించి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎవరికైనా మీ నుంచి డబ్బుని అప్పుగా తీసుకున్నట్లయితే.. ఆ అప్పుని తిరిగి అడగడానికి వెనుకాడవద్దు. మీరు మీ డబ్బు అడగడానికి సంకోచిస్తే.. మీరే నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరితోనైనా వ్యాపారం చేస్తుంటే.. వారితో స్పష్టంగా వ్యవహరించడం నేర్చుకోండి. మొహమాటానికి వెళ్ళితే నష్టపోవాల్సి వస్తుందని చాణక్య చెప్పాడు.
ఆహారం తీసుకోవడంలో సంకోచించ వద్దు: ఎవరైనా సరే ఆహారం తినే విషయంలో సిగ్గుపడవద్దు. ఆహరం తినే సమయంలో అయిష్టతను ప్రదర్శిస్తే ఆకలితో అలమటించాల్సిన ఉంటుంది. కనుక మీకు కావలసినంత ఆహారం తినండి. ఆహారం తినని వ్యక్తీ తన శరీరాన్ని, మనసును అదుపు చేసుకోలేడు. అంతేకాదు ఆకలితో ఉంటే అతని ఆలోచనా శక్తి, అర్థం చేసుకునే శక్తి కూడా తగ్గిపోతుంది.
జ్ఞానాన్ని పొందేందుకు సిగ్గుపడకండి: తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడకూడదని చాణక్యుడు చెప్పాడు. జ్ఞాన సముపార్జన ద్వారానే సమాజంలో సత్సంబంధమైన జీవితాన్ని నిర్మించుకోవడం సాధ్యమవుతుంది. మంచి విద్యను పొందాలనుకుంటే ప్రతి విషయాన్నీ నేర్చుకోవాలి. విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా సందేహం ఉంటే గురువుని ప్రశ్నలు అడగడానికి వెనుకాడనివాడు మంచి విద్యార్థి కాగలడు.
అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి సంకోచించకండి: కొంతమందికి మంచి, చెడుల మధ్య వ్యత్యాసం తెలుసు. అయితే ఆ విషయాలను గురించి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడానికి కొంతమంది సంకోచిస్తారు. కనుక ఎవరైనా సరే తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయాలి.. ఏ విధంగానూ వెనుకాడకూడదు. చాణక్య నీతి ప్రకారం సిగ్గు పడి పది మంది ముందు తమ ఆలోచనలను వెల్లడించకుండా మనసులో పెట్టుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.