AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhishma Niti: తెలియక చేసినా.. పాపం ఎన్ని జన్మలైనా వెంటాడుతుంది.. రాజు దానం చేసే సమయంలో దోషం అంటకుండా ఎలా ఉండాలంటే

Bhishma Niti in Mahabharata: నేటి మానవుడికి మంచి చెడులను గురించి వివరించేది మహాభారతం. ఇక మహాభారతంలో విశిష్టమైన వ్యక్తి అష్టవసువులలో అగ్రగణ్యుడు.. గంగాపుత్రుడవు భీష్ముడు..

Bhishma Niti: తెలియక చేసినా.. పాపం ఎన్ని జన్మలైనా వెంటాడుతుంది.. రాజు దానం చేసే సమయంలో దోషం అంటకుండా ఎలా ఉండాలంటే
Bhyishma Niti
Surya Kala
|

Updated on: Sep 23, 2021 | 6:50 AM

Share

Bhishma Niti in Mahabharata: నేటి మానవుడికి మంచి చెడులను గురించి వివరించేది మహాభారతం. ఇక మహాభారతంలో విశిష్టమైన వ్యక్తి అష్టవసువులలో అగ్రగణ్యుడు.. గంగాపుత్రుడవు భీష్ముడు.. కౌరవుల పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని..  గాయపడి అంపశయ్యమీద ఓఘవతీ తీరంలో పడి ఉన్నాడు. ఆ సమయంలో భీష్ముడు పాండవులకు ఎన్నో నీతికథలను చెప్పాడు. క్షత్రియుడిగా జన్మించి బ్రహ్మచర్యం అవలంబించి రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి అరుదైన వ్యకిత్వం కలిగి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన  గోదానం,  విప్రుల సొమ్ము అపహరణ దోషం గురించి ఈరోజు తెలుసుకుందాం..

“ధర్మనందనా..  గోదానం మంచిబుద్ధితో చేసిన వాడికి మంచి ఫలితం, చెడుబుద్ధితో చేసిన చెడుఫలితం కలుగుతుంది. ఈ సందర్భంలో ఒక కథ చెబుతాను విను అంటూ….. ద్వారావతి నగరంలోని ఒక బావిలో ఒక పెద్దతొండ నివసిస్తూ ఉంది. ఒక రోజు అది మనుష్యుల కంట పడింది. దానిని బావిలో ఉండనిస్తే నీరు పాడౌతుందని ఆ ఊరి జనులు అంతా కలిసి దానిని పెద్ద తాళ్ళతో బయటకు తీయడానికి ప్రయత్నించారు. కాని వారంతా ఎంతగా ప్రయత్నించినా దానిని బయటకు తీయలేక పోయారు. చేసేదిలేక అందరూ శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పారు. శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చి ఆ తొండను బయటకు తీసాడు. శ్రీకృష్ణుడిని చూసి తొండ తాను నృగు మహారాజునని తెలిపింది. శ్రీకృష్ణుడు దానిని గుర్తుపట్టి “అయ్యా ! అనేక గోవులను దానం చేసిన నీకు ఈ గతి ఎలా పట్టింది” అని అడిగాడు.

తొండ కృష్ణుడికి చెప్పిన సమాధానం: 

“ఏమని చెప్పుదును కృష్ణా..  నేను ఒకరోజు ఒక బ్రాహ్మణుడికి ఒక గోవును దానంగా ఇచ్చాను. ఆ బ్రాహ్మణుడు దానిని మేతకని బయటకు తోలిన సమయంలో ఆ గోవు మా గోవులతో కలిసి అలవాటు ప్రకారం మా మందలో చేరి మా ఇంటికి వచ్చింది. అది మా గోపాలకులు గమనించ లేదు. మర్నాడు నేను దానమివ్వడానికి గోవులను తెమ్మని గోపాలకులకు చెప్పగా వారు మిగిన గోవులతో నేను దానం ఇచ్చిన గోవును కూడా తీసుకు వచ్చారు. ఆ విషయము తెలియక నేను ఆగోవును దానంగా ఇచ్చాను. ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు గోవును తోలుకుని పోతుండగా అంతకు ముందు ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు తన గోవును వెతుకుతూ..  ఆ గోవును చూసాడు. అతడు ఆ గోవును చూసి “ఈ గోవును నాకు రాజుగారు దానంగా ఇచ్చారు” అని అన్నాడు. రెండవ బ్రాహ్మణుడు కూడా “ఇది రాజు నాకు దానంగా ఇచ్చిన గోవు” అన్నాడు.

ఇరువురు బ్రాహ్మణులు కొంతసేపు వాదించుకుని చివరకు నా వద్దకు గోవుతో సహా వచ్చారు. నేను ఏమి జరిగింది అనే విషయం విచారిస్తే.. అప్పుడు తెలిసింది. ఒకసారి దానమిచ్చిన గోవును తిరిగి దానం ఇవ్వడం పొరపాటు అని తెలుసు కనుక పొరపాటును సరిదిద్దడానికి మొదటి బ్రాహ్మణుడికి ఆ గోవు బదులు లక్ష గోవులను ఇస్తానని చెప్పాను. అతడు “ఆ గోవు మా పాలిట మహా లక్ష్మి. అది నా కుమారుడికి అడిగినదే తడవుగా పాలను ఇస్తుంది కనుక నాకు ఆ గోవే కావాలి” అన్నాడు.

నేను రెండవ బ్రాహ్మణుడితో ఆ గోవుకు బదులుగా మణులు బంగారం ఇస్తాను దానిని తిరిగి ఇవ్వమని అడిగాను. అతడు “మీ రాజ్యము మొత్తము ఇచ్చినా నాకు వద్దు. నాకు దానంగా ఇచ్చిన గోవే నాకు కావాలి” అన్నాడు. తరువాత నాకు మృత్రువు సంభవించి నేను యమధర్మ రాజు వద్దకు వెళ్ళాను. యమధర్మరాజు ప్రేమతో “రాజా ! నీవు ఎన్నో దాన ధర్మాలు చేసావు. నీకు చాలా పుణ్యము వచ్చింది. కాని నీవు ఒక సారి దానంగా ఇచ్చిన గోవును తిరిగి దానం ఇచ్చావు. తెలియక చేసినా అది పాపం కనుక నీకు దుర్దశ సంభవించింది. కనుక నీవు ముందు దుర్గతి అనుభవిస్తావో సద్గతి అనుభవిస్తావో నీవే తేల్చుకో” అన్నాడు. నేను ముందుగా దుర్గతి అనుభవించడానికి అంగీకరించాను. వెంటనే పై నుండి కిందకు తల కిందులుగా భూమి మీద పడ్డాను. అలా పడడం చూసిన ఒక ముని నన్ను చూసి జాలి పడి..”నీవు తొండ జన్మ ఎత్తుతావు. కొంతకాలానికి నీకు శ్రీకృష్ణుడి చేతి స్పర్శ తగిలి నీ దుర్దశ తొలగి సద్గతి కలుగుతుంది అని చెప్పాడు. ఇంతకాలానికి నాకు నీ చేతి స్పర్శ తగిలింది కనుక ఇక నేను దుర్దశ తొలగి సద్గతికి పోతాను అని చెప్పాడు”.

అది విని శ్రీకృష్ణుడు “విప్రుల సొమ్ము అపహరించడం రాజులకు మహా పాపము. తనకు తెలియకుండానే నృగుడు విప్రుడి సొమ్ము అపహరించి ఇలాంటి దుర్గతిని పొందాడు” అని నృగుడితో సహా అక్కడ గుమి కూడిన ప్రజలకు చెప్పాడు. “కాబట్టి, ధర్మనందనా..  రాజైన వాడు ఈ దోషం తనకు రాకుండా తస్మాత్ జాగ్రత్త వహించాలి”  అంటూ భీష్ముడు చెప్పాడు.

Also Read:

మరణించే సమయంలో ఎదో చెప్పాలని ప్రయత్నించినా ఎందుకు చెప్పలేరో తెలుసా? గరుడ పురాణంలో ఏమి చెప్పారంటే..