ఈ రోజు భగినీ హస్త భోజనం పండగ.. మెట్టింట ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లి అన్న ఎందుకు భోజనం చేయాలంటే..

దీపావళి పండగ ఐదు రోజుల పాటు జరుపుకునే సంప్రదాయంలో ఈ అన్నా చెల్లెళ్ళ పండగ ఒకటి. ఈ రోజు వివాహం అయిన తమ ఇంటిని విడిచి వెళ్ళిన అక్క లేదా చెల్లెల ఇంటికి వెళ్లిన అన్నా లేదా తమ్ముడు.. తన సోదరికి సంతోషం కలిగిస్తాడు. అంతేకాదు ఈ రోజు తమ సోదరి చేతి భోజనం చేయడం వలన అప మృత్యు భయం తొలగిపోతుందని ఓ నమ్మకం. అసలు ఈ పండగ జరుపుకోవడానికి గల కారణం పురాణం లో పేర్కొంది.

ఈ రోజు భగినీ హస్త భోజనం పండగ.. మెట్టింట ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లి అన్న ఎందుకు భోజనం చేయాలంటే..
Bhagini Hastha Bhojanam
Follow us
Surya Kala

|

Updated on: Nov 03, 2024 | 6:41 AM

సోదర సోదరీమణులు మధ్య బంధానికి ప్రతీక గా నిలిచే రాఖీ పండగ తర్వాత జరుపుకునే మరో ముఖ్యమైన పండగ అన్నా చెల్లెళ్ళ పండగ. దీనినే ఉత్తరాదివారు భాయ్ దూజ్ వేడుక అని.. తెలుగు వారు భాగానీ హస్త భోజనం వేడుక అని అంటారు. భగినీ అంటే సోదరి అని అర్ధం. ఆమె చేతితో పెట్టె భోజనం కనుక భగినీ హస్త భోజనం అయింది. ఈ పండగను కార్తీక మాసం శుక్ల పక్ష విదియ రోజున జరుపుకుంటారు.

భగినీ హస్త భోజనం వెనుక ఉన్న పురాణ గాథ

మృత్యు ప్రదాత యమ ధర్మరాజు జీవుల పాపపుణ్యాలు ఎంచుతూ వారికి తగిన విధంగా శిక్షిస్తూ తన విధులను నిర్వహించడంలో బిజీ అయిపోయాడు. పెళ్లి అయిన తమ ఇంటి నుంచి మెట్టింట అడుగు పెట్టిన తన చెల్లెలు యమున ఇంటికి ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాడు. యమున తన అన్నను ఎన్ని సార్లు ఇంటికి భోజనానికి రమ్మనమని పిలిచినా సరే తీరిక లేక యమ ధర్మ రాజు తన చెల్లెలి ఇంటికి వెళ్ళలేదు. దీంతో యమున చాలా నిరాశ చెందుతుంది.

ఇవి కూడా చదవండి

మార్కండేయుడిపై యమ పాశం

మార్కండేయుడు అల్పాయుష్కుడు.. తన ఆయుస్సు గురించి తెలిసిన మార్కండేయుడు శివుడిని శరణ కొతుతూ తపస్సు చేస్తాడు. అయితే మార్కండేయుని మరణ సమయం సమీపించడంతో యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాలను హరించడానికి స్వయంగా మార్కండేయుడి వద్దకు వెళ్తాడు. అప్పుడు మార్కండేయుడు తన భక్తుడు అని.. తనను శరణు వేడుకున్నాడు కనుక అతడిని విడిచి పెట్టమని శివుడు.. యమధర్మ రాజుకి సూచిస్తాడు. అయితే యముడు శివుడు చెప్పిన విషయాన్నీ అంగీకరించడు. జీవుల మరణం ఆసన్నం అయినప్పుడు తన విధులను నిర్వహించడం తన కర్తవ్యం అంటూ మార్కండేయుడి పై యమపాశాన్ని విసురుతాడు. అప్పుడు మార్కండేయుడు శివ లింగాన్ని గట్టిగా పట్టుకుని ఉంటాడు. దీంతో ఆ యమపాశం వెళ్లి శివలింగాన్ని తాకుతుంది. తన మాటని లెక్క చేయకుండా తన మీదకే యమపాశాన్ని విసిరిన యమధర్మరాజుపై శివుడుకి ఆగ్రహం కలుగుతుంది. దీంతో తన త్రిశూలాన్ని యమ ధర్మ రాజుపై ప్రయోగిస్తాడు.

చెల్లెలు ఇంటికి చేరుకున్న యముడు

త్రిశూలం నుంచి తప్పించుకునేందుకు యముడు సర్వలోకాల్లో పరుగెత్తి, పరుగెత్తి చివరకు అనుకోకుండా తన చెల్లెలు యమున ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. తన ఇంటికి అకస్మాత్తుగా వచ్చిన అన్నను చూసిన యమున చాలా సంతోష పడుతుంది. అన్నకు సకల మర్యాదలు చేస్తుంది. చెల్లెల్ని చూసిన ఆనందంలో యమ ధర్మ రాజు కూడా తన వెంట పడుతున్న త్రిశూలం గురించి మరచిపోతాడు. చెల్లెలు చూపించిన ప్రేమ ఆదరణలకు పరవశించి పోతాడు. చెల్లెలు తన అన్నకు ఇష్టమైన వివిధ రకాల వంటలను వడ్డిస్తుంటే యమ ధర్మరాజు వాటిని తింటూ పరవశించిపోతాడు. అదే సమయంలో శివుడు ఆ అన్నా చెల్లెళ్ల బంధాన్ని, అనుబంధాన్ని చూశాడు… భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్లిపోతాడు. అయితే అన్న తన ఇంటికి రావాలి .. తాను స్వయంగా భోజనం పెట్టాలి అన్న యమున కోరిక ఇలా నెరవేరింది. అదే సమయంలో మార్కండేయుడు చిరంజీవిగా చిరకాలం జీవించాడు.

యమునకు యముడు ఇచ్చిన వరం

శివుడి ఆగ్రహం నుంచి తనను రక్షించిన చెల్లెలు.. ప్రేమ అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు. అప్పుడు యమున ను ఓ వరం కోరుకోమని చెబుతాడు. అప్పుడు యమున కార్తీక శుద్ధ విదియ రోజు చెల్లెలి ఇంటికి వెళ్లి, ఆమె చేతి వంట తినే సోదరుడికి అపమృత్యు దోషం తొలగి పోవాలని వరం ఇవ్వమని కోరుతుంది. అంతేకాదు తనను సోదరుడిని ఆదరించి గౌరవించే సోదరికి సౌభాగ్యం కలిగేలా దీవించమని కోరుకుంటుంది. చెల్లెలు కోరిన విన్న యమ ధర్మ రాజు అంగీకరిస్తాడు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఇదే రోజు అంటే కార్తీక శుద్ధ విదియ నాడు చెల్లెలి ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ఇస్తాడు. అందుకనే ఈ పండగను భగినీ హస్త భోజనం అని కూడా అంటారు. హిందువులు ఈ పండుగనే రకరకాల పేర్లతో జరుపుకుంటారు.

ఈ భగినీ హస్త భోజనం రోజు అన్నాదమ్ములు తమ తమ సోదరి వెళ్లి.. ఆమె చేతి వంట తింటారు. పుట్టింటి కానుకగా చీరసారెలను బహుమతిగా ఇచ్చి జీవితాంతం రక్షగా నిలుస్తానని చెప్పి.. ఆమె పది కాలాలు సౌభాగ్యంతో ఆయురారోగ్యాలతో చిరంజీవిగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.