Bangles Festival: గాజుల అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. ఇంద్రధనస్సు ను తలపిస్తున్న ఇంద్రకీలాద్రి
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో.. ముఖ్యంగా యమద్వితీయ నాడు అమ్మవారు ఈ గాజుల అలంకరణలో దర్శనం ఇస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు.

అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి.. రంగురంగుల గాజులతో ఇంద్రధనస్సుని తలపిస్తోంది. కార్తీక మాసంలో యమ ద్వితీయ సందర్భంగా దుర్గమ్మ సన్నిధిలో ఈ రోజు గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తిని , ఆలయ ప్రాంగణాన్ని అందమైన గాజులతో అలంకరించారు. అమ్మవారికి గాజులు అంటే ఎంతో ఇష్టమని .. అందుకనే ఈ పవిత్ర కార్తీక మాసంలో కనకదుర్గా అమ్మవారు నిండుగా గాజులతో దర్శమిస్తున్నారని దుర్గగుడి ఈవో శీనా నాయక్ చెప్పారు.
యమ ద్వితీయను పురస్కరించుకుని ప్రతి ఏటా కార్తీక మాసం రెండో రోజున అమ్మవారి సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు రెండు లక్షలకు పైగా గాజులతో అలంకరించినట్లు తెలుస్తుంది. ఈ గాజుల ఉత్సవం ముగిసిన అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఇతిహాసాలను ప్రస్తావిస్తూ, దీపావళి తర్వాత రెండవ రోజున జరుపుకునే యమ ద్వితీయ పండుగ అన్న చెల్లలు మధ్య అనురాగం, ఆప్యాయతకు ప్రతీక అని చెబుతారు. ఈ సందర్భంగా యముడిని పూజిస్తారు.
కార్తీక మాసోత్సవాలు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్నాయి. మల్లేశ్వరస్వామికి భక్తులు విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, దీపార్చన నిర్వహిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




