AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భక్తులకు అలర్ట్! నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ మధ్యాహ్నం నుంచి ఆలయాల మూసివేత.. !

గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో దేవాలయాలలో పూజలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరు. చంద్రగ్రహణం కారణంగా, దేవాలయాలలో దేవత దర్శనం సాధ్యం కాదు. అయితే గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేయడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆలయాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

భక్తులకు అలర్ట్! నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ మధ్యాహ్నం నుంచి ఆలయాల మూసివేత.. !
Temple Close
Balaraju Goud
|

Updated on: Sep 07, 2025 | 9:09 AM

Share

భారతదేశం ఒక అద్భుతమైన ఖగోళ సంఘటనను చూడబోతోంది. సెప్టెంబర్ 07, 2025 అదివారం రాత్రి, దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ కనిపిస్తుంది. ఈ అరుదైన చంద్రగ్రహణం చంద్రుడు ముదురు ఎరుపు రంగులోకి మారబోతున్నాడు. గ్రహణం సమయాలు సెప్టెంబర్ 7న రాత్రి 8:58 ప్రారంభమవుతుంది. రాత్రి 11:41 లకు గరిష్ట సంపూర్ణతను చేరుకుంటుంది. గ్రహణం నేపథ్యంలో ప్రముఖ ఆలయాలను మూసివేస్తున్నారు.

సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ బోర్డు ప్రకటించింది. గ్రహణానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం జరుగుతుందని తెలిపింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతంతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అయితే తోమల సేవ, అర్చన వంటి కార్యక్రమాలు ప్రైవేట్‌గా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆ సమయంలో దర్శనానికి అనుమతి ఉండదని, భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని సూచించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వారి ఆలయ ద్వారాలు మూసివేస్తున్నట్లు శ్రీశైలం ఈ.ఓ శ్రీనివాసరావు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం గం.1.00 నుండి 8వ తేదీ ఉదయం గం.5.00 వరకు శ్రీశైలం ఆలయంలో భక్తుల దర్శనం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీ స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ఈవో తెలిపారు. అలాగే అన్నీ ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, శ్రీస్వామివారి అమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తిగా నిలుపుదల చేసి, భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతుందని తెలిపారు.సాక్షిగణపతి, హాఠకేశ్వరం, పాలధార పంచధార, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాలను కూడా మూసి వేయడం జరుగుతుందన్నారు.

సెప్టెంబరు 8 వ తేదీన ఉదయం గం.5.00లకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ జరిపించిన తరువాత శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం గం.7.30 నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతుల సమయం నుండే అనగా భక్తులకు అలంకార దర్శనం కల్పించడం జరుగుతుంది. సెప్టెంబర్ 8వ తేదీ నాటికి ఆన్‌లైన్‌లో శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం, బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం గం.2.15 నుండి సాయంకాలం గం.4.00 వరకు శ్రీస్వామివారి స్పర్శ దర్శనం కల్పించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని మూసివేయనున్నారు. ఆలయ ప్రధాన దేవాలయంతో పాటు ఉప ఆలయాలన్నింటినీ మూసివేస్తున్నట్లు వైదిక కమిటీ తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3:30 నుండి కవాట బంధనంతో ఆలయం మూసివేసి, సోమవారం పునః ప్రారంభమై, యధావిధిగా దర్శనాలు జరగనున్నాయి. సోమవారం తెల్లవారుజామున 3:00 గంటల నుండి ఉదయం 8:30 వరకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ తెలిపింది. ఇక ఉదయం 8:30 గంటల నుండి భక్తులకు అన్ని రకాల దర్శనాలు తిరిగి ప్రారంభం అవుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి ఆలయానికి వచ్చే సమయాన్ని ప్లాన్ చేసుకోవాలని ఇంద్రకీలాద్రి ఈఓ ప్రకటించారు.

తెలంగాణలోని యాదగిరిగుట్టలో ఈ ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు భక్తులకు స్వామివారి దర్శనాలకు అనుమతించనున్నారు. చంద్ర గ్రహణం కారణంగా మధ్యాహ్నం 12, సాయంత్రం 4 గంటలకు నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. వాహన పూజలు మధ్యాహ్నం వరకే నిర్వహించనున్నారు. చంద్ర గ్రహణం పూర్తి అయ్యాక, తిరిగి సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేసి సుప్రభాతం, బిందె తీర్థం, బాలభోగం, నిజాభి సహస్రనామార్చనలను అర్చకులు నిర్వహించనున్నారు.

అటు జోగులాంబ గద్వాల జిల్లాలో చంద్రగ్రహణం సందర్భంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు మూసివేస్తన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం గం.1.00 నుంచి ఆలయాలు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గం.6.30నిమిషాల తర్వాత మహా మంగళ హారతి అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు.

నేడు చంద్ర గ్రహణం సందర్భంగా భద్రాచలం రామాలయం మూసివేస్తున్నట్లు అలయ అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సోమవారం తెల్లవారు ఝామున 3 గంటల వరకు ఆలయ మూసివేయనున్నారు. సుప్రభాతం, ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ఆరాధన, నివేదన నిర్వహించిన అనంతరం ఉదయం 7.30 నుంచి స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.

చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 1:00 వరకు ప్రధాన ఆలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 1.23 నిమిషాల వరకు గ్రహణ విముక్తి కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 1000 స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి ఆలయం, రామప్ప, కాలేశ్వరం, పాలకుర్తి సోమేశ్వరాలయం, కురవి వీరభద్ర స్వామితో సహా అన్ని ఆలయాలను ద్వారా బంధనం చేయనున్నట్లు అర్చకులు తెలిపారు. మరోవైపు సాయంత్రం 7గంటల లోపే భోజనాలు పూర్తి చేసుకుని గ్రహణ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు పండితులు.

జ్యోతిష్కుల ప్రకారం, గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో దేవాలయాలలో పూజలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరు. చంద్రగ్రహణం కారణంగా, దేవాలయాలలో దేవత దర్శనం సాధ్యం కాదు. అయితే గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేయడం సర్వసాధారణం. అయితే తిరుపతి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో మాత్రం పూజలు జరుగుతూనే ఉంటాయి. గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా ఉన్న ఆలయంలో స్వయంభుగా వెలిసిన మహాలింగానికి 9 గ్రహాలు, 27 నక్షత్రాలతో అలంకార కవచం ఉండమే ప్రత్యేకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..