Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున బంగారం కొనాల్సిందేనా? పురాణాలు ఏం చెబుతున్నాయి?

మగువలకైతే మరీనూ. సిరిసంపదలున్న చోట బంగారముంటుందో. బంగారమున్నచోట సిరిసంపదలు వర్ధిల్లుతాయో తెలియదు కానీ మనవాళ్లకు మాత్రం బంగారమున్న చోట లక్ష్మీ తాండవిస్తుందనేది గట్టి విశ్వాసం.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున బంగారం కొనాల్సిందేనా? పురాణాలు ఏం చెబుతున్నాయి?
Akshaya Tritiya Buying Gold
Follow us
Balu

| Edited By: Balaraju Goud

Updated on: May 14, 2021 | 8:28 AM

Akshaya Tritiya Gold Purchase: భారతీయులదీ బంగారానిదీ ఫెవికాల్‌ బంధం. విడదీయలేని సంబంధం. బంగారమంటే ఎందుకోగాని మొహాలు బంగారంలా వెలిగిపోతాయి. మగువలకైతే మరీనూ. సిరిసంపదలున్న చోట బంగారముంటుందో. బంగారమున్నచోట సిరిసంపదలు వర్ధిల్లుతాయో తెలియదు కానీ మనవాళ్లకు మాత్రం బంగారమున్న చోట లక్ష్మీ తాండవిస్తుందనేది గట్టి విశ్వాసం. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే సిరి నట్టింట్లో పద్మాసనమేసుకుని కూర్చుంటుదనే బలమైన నమ్మకం.

అక్షయ తృతీయ. మనకు ఇలాంటి పండుగ ఒకటుంటుందని ఇంతకు ముందు తెలియదు. ఉత్తర భారతీయులకు మాత్రం ఇదో పర్వదినం. బంగారానికి ముడిపెట్టిన పండుగదినం. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే నట్టింటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందట! ఇదో నమ్మకం. బంగారాన్ని అమ్ముకోవడం కోసం కొత్తగా పుట్టుకొచ్చిన నమ్మకం. ఈ రోజు బంగారు వ్యాపారులకు మాత్రం పసిడి పంటే! కొన్న వాళ్లకేమో కానీ. వ్యాపారుల ఇంటికి మాత్రం లక్ష్మీదేవి పరుగెత్తుకుంటూ వెళుతుందనేది మాత్రం నిజం. అక్షయ తృతీయ పండుగ వెనుక పెద్ద కథే వుంది. అక్షయమంటే క్షయం లేనిదని అర్థం. జీవితంలో అన్నింటినీ అక్షయం చేసే పర్వదినం కాబట్టే దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియనాడు జరుపుకోవడం ఆచారం. సంప్రదాయం. వైశాఖ మాసస్య చయా తృతీయా. నవమ్యసా కార్తీక శుక్లపక్షో. నభస్య మాసన్య తమిస్రపక్షో. త్రయోదశే పంచదశీచమాఘే అనేది పురాణ సూక్తం. వైశాఖ శుద్ద తృతీయ నాడు కృత యుగం. కార్తీక శుక్ల నవమి రోజున త్రేతాయుగం.భాద్రపద బహుళ త్రయోదశినాడు ద్వాపరయుగం. మాఘ బహుళ అమావాస్య నాడు కలియుగం ప్రారంభమయ్యాయి. ఆ లెక్కన కృతయుగ ఆరంభమే అక్షయ తృతీయన్నమాట.

ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించి , గోధుమలు, శనగలు, పెరుగన్నం దానం చేస్తే సకల పాపాలు తొలిగిపోతాయట. గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలు కూడా దానం చేస్తే శివసాయుజ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున ప్రత్యేకంగా చేసే దాన ధర్మాలు పితృదేవతలకు చేసే పూజలు అక్షయ పుణ్య ఫలితాలిస్తాయని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు చెప్పాడంటారు. బదరీనాథ్‌ క్షేత్రంలోని బదరీనారాయణ స్వామి ఆలయాన్ని అక్షయ తృతీయ రోజే తెరుస్తారు. అక్షయ తృతీయ అంటే అపరిమితమైన ఆనంద ఐశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని అర్థం. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని నమ్మకం. ఈ నమ్మకమే బంగారం వ్యాపారస్తులకు కొంగు బంగారమైంది…

రెండు దశాబ్దాల కిందట అక్షయ తృతీయకు ఇంతటి క్రేజు లేదు. జనాలకు ఇంతటి మోజూ లేదు. అసలు ఇలాంటి పండగ ఒకటుందని తెలిసింది లేదు. ఇప్పుడు ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చేసింది. ఎంతగా అంటే ఆ రోజున బంగారం కొనకపోతే పరిస్థితి బాగుండదేమో అని ప్రజలు అనుకునేటంతగా. పురాణ కాలం నుంచి అక్షయ తృతీయ ప్రస్తావన వుంది.. నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజు ఇదేనట! మహా విష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా ఈ రోజునేనట! ఈ పండుగ రోజున పుష్పమో, ఫలమో భగవంతుడికి అర్పించినా, దైవనామస్మరణ చేసినా, ఆఖరికి నమస్కారం చేసినా అక్షయమైన సంపద పుణ్యం లభిస్తాయని ప్రతీతి.

అంతే తప్ప బంగారాన్ని తప్పనిసరిగా కొనాలని ఏ పురాణము చెప్పలేదు. అక్షయ తృతీయ నాడు గురు రాఘవేంద్రుని భక్తులు ఆ స్వామిని ఆరాధించి బంగారాన్ని సమర్పిస్తారు. కొందరు ముత్యాల శంఖాన్ని పూజిస్తారు. ఇంకొందరు పాదరస లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ ప్రసన్నం చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు కుబేరుడిని ఆరాధిస్తారు. దుర్గను కొలుస్తారు. ఈ రోజున ఏకాక్షీ నారికేళాన్ని పూజించేవారు కూడా వున్నారు. ఇవన్నీ పురాణ కథలు. ఎక్కడా పసిడిని కొనాలని లేదు. ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ, ఈ ట్రెండ్‌ మాత్రం స్వల్ప సమయంలోనే పాపులరైంది.

Read Also…  Parshuram Jayanti 2021: పరశురామ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు.. శుభ సమయం, ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకుందామా..