ఒక్క కొబ్బరికాయ కొడితే కోరిన కోర్కెలు తీర్చే నారికేళా గణనాథుడు.. ఇదెక్కడ.. ఆలయ విశిష్టత ఏంటి?
ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ ఆ గణనాధుడు స్వయంభూగా వెలసిన గణపతి క్షేత్రం.
Ainavilli Sri Vighneswara Swamy Temple: ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ ఆ గణనాధుడు స్వయంభూగా వెలసిన గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం పొందింది. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో వెలసింది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, ప్రకృతి రమణీయతలతో, సుందర ప్రశాంత వాతావరణం ఈ ఆలయం భాసిల్లుతుంది. ఏకదంతుడు ఇక్కడ సిద్ది వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నారు. అంతేకాదు ఈ వినాయకునికి నారికేళా వినాయకుడు అని కూడా అంటారు. ఒక్క కొబ్బరికాయ కొడితే, కోరిన కోర్కెలు తీర్చే నారికేళా గణనాథుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. అంతటి ప్రత్యేక ఆలయం అయిన అయినవిల్లి వినాయకునిపై .వినాయక చవితి సంధర్భంగా ప్రత్యేక కథనం.
ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతుంటారు. స్వయంభువ వినాయక క్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు అని చెపుతుంటారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.
ఆలయం చరిత్ర.. ఈ క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనది స్థలపురాణం వివరిస్తుంది. పూర్వం అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతూ వుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని 14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొనబడింది. ఈ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడనీ తరువాతి కాలంలో వారే మూగ, చెవిటి,గుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుడి ఆవిర్భావాన్ని గుర్తించారని స్థలపురాణం వివరిస్తుంది.
ఆలయప్రశస్థి.. సువిశాలమైన ఆవరణలో ఎతైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాలయంలో శ్రీవిఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా ప్రతీ దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అయితే అయినవిల్లిలో సిద్ధివినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం. అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహాద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలుగవని, గృహాలు సంవృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢవిశ్వాసం. రెండు గోపురాలతోచూపరులను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం సందర్శకులను సమ్మోహనపరుస్తూ ఉంది. ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవునికి, శివునికి, శ్రీఅన్నపూర్ణాదేవికి, శ్రీకాలభైరవస్వామికి ఉపాయాలు ఉన్నాయి. శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తున్నారు.
దర్శించుకోవడం ఎలా.. ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి. దక్షిణ గోపురం ద్వారా ఆలయానికి చేరితే వినాయకుడిని దర్శనం చెసుకోవచ్చు. ఇక్కడ స్వామి దక్షిణ ముఖుడై ఉన్నాడు. ప్రధాన ఆలయంలోని విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి తూర్పు గోపురం నుండి ప్రవేశించవచ్చు. ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఆలయం లోనే శ్రీదేవి, భూదేవి సమేతుడైన కేశవ స్వామి ఉన్నారు. అన్నపూర్ణా దేవి ఆలయం కూడా ఈ ఆలయ సన్నిధిలో ఉంది. ఆలయానికి క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు గుడి కూడా ప్రధానాలయ ప్రాంగణం లోనే ఉంది. ఈ ఆలయానికి వివిధ ప్రదేశాలనుండి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకొంటారు. ఇక్కడి ఆలయంలో పూజలు శైవ ఆగమశాస్త్రానుసారంగా జరుగుతాయి.
ప్రత్యేక పూజలు ఈ ఆలయంలో ప్రతీనెలా కృష్ణపక్ష, శుక్లపక్ష చవితి తిధులు, దశమి, ఏకాదశులలో, వినాయకచవితి పర్వదినాలలో సిద్ధివినాయకునికి విశేషార్చనలు జరుపుతారు. ప్రతినిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికాయలు, పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోర్కెలు తీరిన వెంటనే మరలా మొక్కుబడులు తీర్చుకొ నడం విశేషం. దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని సందర్శిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని విశ్వసిస్తున్నారు. అయినవిల్లి సిద్ధివినాయకుని భక్తిశ్రద్ధలతో అర్చిస్తే కోర్కెలతోపాటు బుద్ధి వికసిస్తుందని విశ్వసిస్తున్నారు.
అంతే కాకుండా మార్చి నెలలో స్వామివారికి లక్ష పెన్నులతో పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా సప్తనది జలాల అభిషేకం చేసి తరువాత లక్ష పెన్నులతో పూజా నిర్వహిచి ఆ పెన్నులను చదువుకునే విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఈ పెన్నులు తీసుకునేందుకు సుదూర ప్రాంతాలనుండి ఇక్కడకు వచ్చి మరీ పెన్నులు తీసుకెళ్తారు.ఈసారి కరోనా కారణంగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇప్పటికే పలు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఏక్కడికక్కడే శానిటేషన్ ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
Vinayaka Chavithi: లంబోదరుడి రూపాలు ఎన్నో… వినాయకుడి రూపం వెనుక ఉన్న తాత్వికత ఏంటీ..!