MLA: మీ ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటి? ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే!
MLA: మీ ప్రాంతంలో ప్రస్తుతం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యను గుర్తు చేసుకోండి. అది ఎమ్మెల్యే పరిధిలోదా? ఎంపీ పరిధిలోదా? లేక మీ మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ పరిధిలోదా? ఈ తేడా తెలుసుకోవడం చిన్న విషయం అనిపించినా.. సమస్యను సరైన అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఇది..

MLA: మన రోజువారీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే మనం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహజం. అయితే ఏ సమస్యకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎమ్మెల్యే అసలు ఏం చేస్తారు? అనే విషయం చాలామందికి స్పష్టంగా తెలియదు. ఇటీవల ఎంపీ బాధ్యతల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే (MLA – Member of Legislative Assembly) పాత్ర ఏంటో తెలుసుకుందాం.
ఎమ్మెల్యే అంటే ఎవరు?
ఎమ్మెల్యే అంటే శాసనసభ సభ్యుడు. ప్రజలు తమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేను ఎన్నుకుంటారు. ఎంపీతో పోలిస్తే ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే ప్రాంతం సాధారణంగా చిన్నదిగా ఉంటుంది. ఎంపీ దేశ స్థాయిలో పార్లమెంట్‌లో పనిచేస్తే.. ఎమ్మెల్యే రాష్ట్ర శాసనసభలో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు విభజించారు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, రైల్వేలు వంటి ప్రధాన అంశాలు కేంద్ర పరిధిలో ఉంటాయి. వీటికి సంబంధించిన జాతీయ స్థాయి విధానాలు, చట్టాల్లో ఎంపీల పాత్ర ఉంటుంది. అదే సమయంలో పోలీసులు, భూమి రికార్డులు, వ్యవసాయం, ప్రజారోగ్యంలో అనేక అంశాలు, పాఠశాల విద్యలో పెద్ద భాగం రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. అందువల్ల మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, దాని విధానాలు కీలకంగా ఉంటాయి.
పోలీస్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు..
మీ ప్రాంతంలో పోలీస్ వ్యవస్థ, భూమి రికార్డులు, ప్రభుత్వ ఆసుపత్రులు, వ్యవసాయానికి సంబంధించిన అనేక ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. అందువల్ల ఇలాంటి అంశాల విషయంలో ఎమ్మెల్యే పాత్ర ఎంపీ కంటే దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ప్రతి సమస్యను పరిష్కరించే అధికారి కాదు. సంబంధిత శాఖలు, అధికారులు, స్థానిక సంస్థల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి.
ఎమ్మెల్యేలకు కూడా అభివృద్ధి నిధులు:
ఎంపీలకు MPLADS తరహాలోనే కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు కూడా MLALAD లేదా ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉంటాయి. ఈ నిధుల ద్వారా నియోజకవర్గంలో అవసరమైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యేలు సిఫారసు చేయవచ్చు. అయితే ఎమ్మెల్యే స్వయంగా ఆ డబ్బును ఖర్చు చేయరు. సాధారణంగా సంబంధిత జిల్లా లేదా ప్రభుత్వ అధికారులు పనులకు అనుమతులు ఇచ్చి, వాటిని అమలు చేస్తారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు ఒకేలా ఉండవు. ఎమ్మెల్యేలకు లభించే నియోజకవర్గ అభివృద్ధి నిధుల మొత్తం దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండదు. అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, అందుబాటులో ఉన్న సమాచార ప్రకారం ఢిల్లీలో ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధిని ఏటా రూ.15 కోట్లకు పెంచారు. పంజాబ్, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఇది రూ.5 కోట్ల స్థాయిలో ఉండగా.. అసోం, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో రూ.2 కోట్ల స్థాయిలో ఉంది. అంటే ఇద్దరు వ్యక్తులు వేర్వేరు రాష్ట్రాల్లో నివసిస్తూ ఎమ్మెల్యేల ద్వారా నియోజకవర్గ అభివృద్ధి నిధులు పొందుతున్నా.. ఆ నిధుల పరిమాణం రాష్ట్రాన్ని బట్టి గణనీయంగా మారవచ్చు.
ఎమ్మెల్యేకు ఉన్న మరో కీలకమైన అవకాశం
ఎంపీతో పోలిస్తే ఎమ్మెల్యేకు మరో ప్రత్యేకమైన అవకాశం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకు చెందిన పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి లభించే అవకాశం ఉంటుంది. మంత్రి అయితే ఆరోగ్యం, వ్యవసాయం, హోం, విద్య వంటి కీలక శాఖలను నేరుగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి అయిన ఎమ్మెల్యేకు సంబంధిత శాఖపై ప్రత్యక్ష పరిపాలనా బాధ్యతలు ఉంటాయి. అయితే ప్రతి ఎమ్మెల్యే మంత్రి అవుతారనేది కాదు. అది రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ ఏర్పాటు, పార్టీ నిర్ణయాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మరి స్థానిక సమస్యలకు ఎమ్మెల్యేనే ఎందుకు గుర్తుకొస్తారు?
మన ప్రాంతంలో రోడ్డు పాడైనా, డ్రైనేజీ సమస్య వచ్చినా, వీధిలో చెత్త పేరుకుపోయినా చాలాసార్లు మొదట గుర్తుకొచ్చేది ఎమ్మెల్యే లేదా ఎంపీ. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.
1. జాతీయ రాజకీయాలకు, పార్లమెంట్‌కు మీడియా కవరేజ్ ఎక్కువగా ఉండటం.
2. ఎంపీ, ఎమ్మెల్యే అనే పదవులు రెండూ ప్రజాప్రతినిధులే కావడంతో వాటి బాధ్యతల విషయంలో చాలామందికి గందరగోళం ఉండటం.
3.ప్రతి స్థానిక సమస్య ఎమ్మెల్యే లేదా ఎంపీ పరిధిలో ఉండదు.
రోడ్డు ఎవరు వేయాలి? డ్రైనేజీ ఎవరు చూడాలి?
మీ వీధిలో రోడ్డు వేయడం, డ్రైనేజీ శుభ్రం చేయడం, స్థానిక పారిశుధ్యం వంటి అనేక పనులు సాధారణంగా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ వంటి స్థానిక సంస్థల పరిధిలో ఉంటాయి. అందుకే ఒక సమస్య వచ్చినప్పుడు ముందుగా అది ఎమ్మెల్యే పరిధిలోనా? ఎంపీ పరిధిలోనా? లేక స్థానిక సంస్థ పరిధిలోనా? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మూడు పదవులు.. మూడు రకాల బాధ్యతలు
సింపుల్‌గా చెప్పాలంటే..
- ఎమ్మెల్యే: రాష్ట్ర స్థాయి చట్టాలు, విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై శాసనసభలో పాత్ర; రాష్ట్ర పరిధిలోని అంశాలపై ప్రాతినిధ్యం.
- ఎంపీ: దేశ స్థాయి చట్టాలు, జాతీయ విధానాలు, కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటరీ పర్యవేక్షణ.
- మున్సిపాలిటీ/పంచాయతీ: స్థానిక రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి అనేక స్థానిక సేవలు, అభివృద్ధి పనులు. అయితే వాస్తవ బాధ్యత రాష్ట్ర చట్టాలు, స్థానిక సంస్థల అధికారాలు, నిర్దిష్ట శాఖ ఆధారంగా మారవచ్చు.
మీ ప్రాంతంలో ప్రస్తుతం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యను గుర్తు చేసుకోండి. అది ఎమ్మెల్యే పరిధిలోదా? ఎంపీ పరిధిలోదా? లేక మీ మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ పరిధిలోదా? ఈ తేడా తెలుసుకోవడం చిన్న విషయం అనిపించినా.. సమస్యను సరైన అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సరైన సమస్యను సరైన ప్రజాప్రతినిధి లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే పరిష్కారానికి మొదటి అడుగు.
మరిన్ని రాజకీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
