భారతీయ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయి..! ఆపిల్, శాంసంగ్‌కు పోటీగా దేశీయ కంపెనీలు!
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారత్ మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు విదేశీ బ్రాండ్ల ఆధిపత్యం కొనసాగుతున్న మొబైల్ రంగంలో సొంత డిజైన్, సొంత బ్రాండ్‌తో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2028 అక్టోబర్ 23 నాటికి భారతీయ డిజైన్‌తో, దేశంలోనే తయారైన భారతీయ బ్రాండెడ్ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారత్ మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు విదేశీ బ్రాండ్ల ఆధిపత్యం కొనసాగుతున్న మొబైల్ రంగంలో సొంత డిజైన్, సొంత బ్రాండ్‌తో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2028 అక్టోబర్ 23 నాటికి భారతీయ డిజైన్‌తో, దేశంలోనే తయారైన భారతీయ బ్రాండెడ్ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ కంపెనీలకు దీటుగా భారతీయ సంస్థలను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
భారతీయ డిజైనర్లకు సవాలు.. ఇప్పటికే కీలక పురోగతి
ఢిల్లీలో జరిగిన ప్రముఖ ఛానల్ సమ్మిట్‌లో మాట్లాడిన అశ్విని వైష్ణవ్.. స్మార్ట్‌ఫోన్ తయారీ వెనుక ఉన్న సాంకేతిక సంక్లిష్టతలను వివరించారు. చిన్న పరికరంలోనే యాంటెన్నా, రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్, ప్రాసెసింగ్ వ్యవస్థ, మెమరీ, కెమెరా, డిస్‌ప్లే, పవర్ మేనేజ్‌మెంట్ వంటి అనేక భాగాలను సమర్థంగా అమర్చాల్సి ఉంటుందని చెప్పారు.
మూడేళ్ల క్రితం భారతీయ డిజైనర్లకు మొబైల్ ఫోన్ మదర్‌బోర్డ్‌గా పనిచేసే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (పీసీబీ)ను రూపొందించాలని సవాలు విసిరినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రయత్నంలో రెండు భారతీయ సంస్థలు ముందుకొచ్చి 5G మొబైల్ ఫోన్ పీసీబీలను రూపొందించాయని వెల్లడించారు. వాటిలో ఒక సంస్థ రూపొందించిన డిజైన్‌ను అమెరికాలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక చేసుకుందని, ఆ సంస్థకు సంబంధించిన ఫోన్ ఇప్పటికే తయారై వినియోగదారులకు చేరిందని పేర్కొన్నారు.
భారతీయ మేధో సంపత్తికి ప్రాధాన్యం
ఇప్పటివరకు విదేశీ సంస్థల సాంకేతికత, బ్రాండ్లపై ఆధారపడిన భారత్.. ఇకపై సొంత డిజైన్, సొంత మేధో సంపత్తి, దేశీయ బ్రాండ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టనుందని మంత్రి చెప్పారు. దేశంలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం భారత్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోవడం ఈ ప్రణాళికలో కీలకమని వివరించారు.
ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లోనూ దూకుడు
గత కొన్నేళ్లలో మొబైల్ ఫోన్లు, డ్రోన్లు, క్షిపణులు, రైళ్లు సహా వివిధ సాంకేతిక ఉత్పత్తుల తయారీలో భారత్ సామర్థ్యం పెంచుకుందని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో మూడో స్థానంలో ఉందని, త్వరలో రెండో స్థానానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2028 లక్ష్యం నెరవేరితే ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారతీయ బ్రాండ్లకు కొత్త అవకాశాలు ఏర్పడవచ్చు. అయితే, ఆపిల్, శాంసంగ్‌లతో పోటీ పడాలంటే నాణ్యత, ధర, సాంకేతికత, సాఫ్ట్‌వేర్ మద్దతు, ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ వంటి అంశాల్లోనూ దేశీయ సంస్థలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
