TELANGANA POLITICAL PARTIES: మూడు పార్టీల్లో మూడు భిన్నమైన మూడ్.. సర్వేల్లో కారు.. యాత్రల్లో కమలం.. చింతన్ శివిర్‌ హస్తం.. అందరి నజర్ ఎన్నికలే

Telangana Politics: తెలంగాణ రాజకీయ పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా పలువురు రాజకీయ నాయకులు పోలీసు కేసుల్లో ఇరుక్కుంటూ.. నిత్యం మీడియా ముంగిట్లో దర్శనమిస్తున్నారు. అయితే, మూడు ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఇపుడు ఒక్కోరకమైన ప్రత్యేక పరిస్థితి కనిపిస్తోంది.  

TELANGANA POLITICAL PARTIES: మూడు పార్టీల్లో మూడు భిన్నమైన మూడ్.. సర్వేల్లో కారు.. యాత్రల్లో కమలం.. చింతన్ శివిర్‌ హస్తం.. అందరి నజర్ ఎన్నికలే
Revanth Reddy- CM Kcr-Bandi Sanjay
Rajesh Sharma

|

Jun 08, 2022 | 6:47 PM

TELANGANA POLITICAL PARTIES UNDER DIFFERENT CONDITIONS AND STRATEGIES: తెలంగాణాలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో మూడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే సమయంలో ఒక్కో పార్టీలో ఒక్కో విధమైన పరిణామాలు చోటు చేసుకోవడం యాదృచ్ఛికమే అయినా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి(TRS), భారతీయ జనతా పార్టీ(Telangana BJP), కాంగ్రెస్(Telangana Congress) పార్టీలు.. తమ తమ వ్యూహాలకు అనుగుణంగా ముందుకెళుతున్నాయి. అదేసమయంలో ప్రత్యర్థి పార్టీలను గుక్క తిప్పుకోనీయకుండా మాటల మంటలు రేపుతున్నాయి. వ్యూహరచన కోసం మేధోమధనం కొనసాగిస్తూనే అందివచ్చిన అవకాశాన్ని దేన్నీ వదలకుండా పొలిటికల్ ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. గత సంవత్సరం వరిధాన్యం సేకరణ నుంచి ప్రస్తుతం సంచలనం రేపుతున్న అత్యాచారాల పరంపర దాకా కాదేదీ రాజకీయానికి అనర్హం అన్నట్లుగా తెలంగాణ రాజకీయ పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా పలువురు రాజకీయ నాయకులు పోలీసు కేసుల్లో ఇరుక్కుంటూ.. నిత్యం మీడియా ముంగిట్లో దర్శనమిస్తున్నారు. అయితే, మూడు ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఇపుడు ఒక్కోరకమైన ప్రత్యేక పరిస్థితి కనిపిస్తోంది.

ముందుగా అధికార పార్టీ టీఆర్ఎస్ గురించి చెప్పుకోవాలి. 2018 లాగే ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నారు గులాబీ దళపతి కేసీఆర్(CM KCR). రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌(Prashant Kishor)తో వరుస భేటీల తర్వాత నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే 70 సీట్లలో సర్వే పూర్తి అయినట్లు కథనాలు వస్తున్నాయి. త్వరలోనే మిగిలిన నియోజకవర్గాల సర్వే ఫలితాలను, నివేదికను కేసీఆర్ ముందుంచబోతోంది పీకే టీమ్ (PK Team). అయితే.. పీకే టీమ్ చేస్తున్న సర్వేలో 40 మంది టీఆర్ఎస్ సిట్టింగ్ శాసనసభ్యులపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం పార్టీలో పెద్ద చర్చకు తెరలేపింది. నెగెటివ్ రిపోర్టు వచ్చిన ఎమ్మెల్యేల స్థానంలో నియోజకవర్గంలో అర్థబలం, అంగబలం ముఖ్యంగా ప్రజల్లో సానుకూలత వున్న ప్రత్యామ్నాయ నేతల కోసం కేసీఆర్ వడపోత ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. దాంతో ఎవరికి వారు తమపై ఎలాంటి నివేదిక బిగ్ బాస్‌ (Big Boss)కు అంది వుంటుందా అని ఆరాలు తీస్తున్నారు. తమ సీటును ఖాయం చేసుకోవాలంటే ఏం చేయాలా అని పార్టీలోని సన్నిహితులతో మంతనాలు మొదలుపెట్టారు. మిగిలిన 40 సీట్లకు సంబంధించిన నివేదిక జూన్ 20వ తేదీ నాటికి కేసీఆర్‌కు చేరుతుందని తెలుస్తోంది. పొలిటికల్ ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను సునిశితంగా గమనిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత సొంత పార్టీ నేతల పనితీరుపైనా దృష్టి సారించారు. 2023 నవంబర్‌లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఆరునెలల ముందే జరపొచ్చన్న అంచనాల నేపథ్యంలో కేసీఆర్ వడపోత కార్యక్రమం మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించే అవకాశం ఉన్న వారికే పార్టీ టికెట్‌ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. పీకే అనుచరులు రూపొందిస్తున్న ఐ ప్యాక్‌ I Pack నివేదికల నేపథ్యంలో 40 మందికి పైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం దక్కక పోవచ్చని తెలుస్తోంది. వివిధ కోణాల్లో సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి రూపొందిస్తున్న ఈ నివేదికల ఆధారంగా గ్రౌండ్ లెవెల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహానికి కూడా ఇప్పటినుంచే పదును పెట్టాలని అధినేత కేసీఆర్‌ భావిస్తున్నారు. మెయిన్ మీడియా సంస్థలతోను, వాటి ప్రతినిధులతోను పార్టీ పరంగా ఉన్న సంబంధాలు, సమాచారం పంపిణీ, సామాజిక మాధ్యమాల్లో పార్టీకి అనుకూలం, ప్రతికూలంగా జరుగుతున్న ప్రచారం తదితరాలను కూడా ఐప్యాక్‌ టీమ్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వివిధ సందర్భాల్లో పార్టీ తరపున మీడియాలో మీడియాలో మాట్లాడుతున్న ప్రతినిధుల సమర్ధత, వారికి వివిధ అంశాలపై ఉన్న అవగాహన, వారికున్న లాంగ్వేజ్ కమాండ్  తదితరాలను కూడా ఐప్యాక్‌ అనలైజ్ చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల వ్యూహాలను కూడా మదింపు చేస్తోంది ఐప్యాక్ టీమ్(I PAC team). సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న నియోజకవర్గాలలో ప్రత్యామ్నాయంగా ధీటైన నాయకులపై కూడా పీకే టీమ్ ఓ నివేదిక ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ముందస్తు ఊహాగానాలు తెలంగాణలో మరింత ఉధృతమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ (2022) లేదా జనవరి (2023)లలో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయవచ్చని, తద్వారా వచ్చే సంవత్సరం జరగనున్న కర్నాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికలతోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections 2024) జరిగేలా చూసుకోవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే 2023 ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. జూన్ 7వ తేదీన ఢిల్లీలో కలిసిన తెలంగాణ కీలక నేతలంతా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో జరిగిన భేటీలోను ప్రధాని మోదీ (Modi) ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party)లో తాజాగా దూకుడు మరింత ఉధృతమైంది. వరిధాన్యం సేకరణపై పోరు, ప్రజా సంగ్రామ యాత్ర వంటి కార్యక్రమాలకు తోడు జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా నజర్ పెట్టడంతో తెలంగాణ కమలం శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిపోతోంది. మే నెలలో ముగ్గురు ప్రధాన జాతీయ నేతలు తెలంగాణకు వచ్చి వెళ్ళారు. మే5వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా భూత్‌పూర్ సభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), మే 14వ తేదీన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సభలో హోం మంత్రి అమిత్ షా (Amit Shah), మే 26వ తేదీన హైదరాబాద్ బేగంపేట ఏయిర్‌పోర్టులో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. ముగ్గురు నేతలు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తాజాగా జీహెచ్ఎంసీలో బీజేపీ కార్పొరేటర్లు 47 మందిని ప్రధాని మోదీ ఢిల్లీ పిలిపించుకుని మరీ సమావేశమయ్యారు. వారిని రాజకీయంగా ముందుకు సాగాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులను అధిరోహించేలా వ్యూహాత్మకంగా నడచుకోవాలని వారికి సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రజలకు ఆదర్శవంతంగా వుండాలని వారికి సలహా ఇచ్చారు. అయితే, ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. పార్టీ ఇంటర్నల్ నివేదికల ప్రకారం తెలంగాణలోని 117 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీకి 80 నుంచి 90 సీట్లు వచ్చే అవకాశం వుందని మోదీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో పార్టీ ఇంటర్నల్ నివేదికలు నిజమయ్యాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోను అదే పునరావృతం అవుతుందని ఆయనన్నట్లు తెలుస్తోంది.  నిజానికి మోదీ మే 26వ తేదీన హైదరాబాద్ వచ్చినపుడే జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను కలవాలని భావించారు. కానీ ఆ సందర్భంలో హెక్టిక్ షెడ్యూల్ కారణంగా కుదరకపోవడంతో తాజాగా ఢిల్లీకి పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ బీజేపీలో మరో అంశం కూడా నూతనోత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. జులై 2,3 తేదీలలో బీజేపీ జాతీయ నాయకత్వం మొత్తం హైదరాబాద్ నగరానికి తరలి రానున్నది. జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించడంతో సుమారు 150 మంది బీజేపీ ముఖ్యనేతలంతా రెండ్రోజుల పాటు భాగ్యనగరంలో మకాం వేయనున్నారు. హైటెక్స్ ప్రాంగణంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. వారికి నోవాటెల్ హోటల్లో బస ఏర్పాటు చేస్తున్నారు. అదేసమయంలో ప్రధాని మోదీ మాత్రం రాజ్‌భవన్ అతిథి గృహంలో బస చేస్తారని తెలుస్తోంది. ఈ సందర్భాన్ని రాజకీయంగా కూడా వినియోగించుకునేందుకు తెలంగాణ బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి సోమాజీగూడ రాజ్‌భవన్ అతిథి గృహం దాకా ప్రధాని మోదీతో రోడ్ షో జరిపేలా బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణ సీఎం అడ్డా ప్రగతి భవన్ మీదుగా ఈ రోడ్ షో జరగుతుంది. ఆ దృశ్యం ఎంత శోభాయమానంగా వుంటుందో ఊహించుకోవాలంటూ బీజేపీ నేతలు పరస్పరం చతురోక్తులు విసురుకుంటుండడం ఆసక్తికరం.

ఇక తెలంగాణలో మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌లో మాత్రం కాసింత ఉత్సాహం.. కాసింత సందిగ్ధం కనిపిస్తుంది. మే నెల మొదటివారంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) వచ్చి వరంగల్ డిక్లరేషన్ (Warangal Declaration) ప్రకటించిన దరిమిలా పార్టీలో ఉన్నట్లుండి ఉత్సాహం ప్రస్ఫుటమైంది. రాహుల్ ప్రకటించిన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు టీపీసీసీ (TPCC) ప్రణాళిక రచించింది. దానికి అనుగుణంగా కొందరు నేతలు ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జరుపుతున్న పాదయాత్ర ప్రత్యక్ష తార్కాణం. రాహుల్ రాకకు ముందే భట్టి పాదయాత్ర ప్రారంభించినా.. రాహుల్ వచ్చి వెళ్ళాక దాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తున్నారు. అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళారు. ఫండ్ రైజింగ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వీరిద్దరు అమెరికా పర్యటనలో వున్నప్పుడే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర స్థాయి చింతన్ శివిర్ నిర్వహించుకున్నారు. ఈ శివిర్‌లో తీసుకున్న నిర్ణయం వారం తిరక్కుండానే పున:సమీక్షలో పడింది. ఓరకంగా చెప్పాలంటే ఆ నిర్ణయం అమలుపై పార్టీ వర్గాల్లోనే అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించాలన్నది చింతన్ శివిర్‌లో తీసుకున్న కీలక నిర్ణయం. ఈ నిర్ణయానికి టీపీసీసీ నుంచిగానీ, హైకమాండ్ నుంచి గానీ ఆమోద ముద్ర ఇంకా పడలేదు. కానీ.. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ఉత్పన్నమయ్యే పరిణామాలను అంచనా వేసిన తర్వాత ఇది సరైన నిర్ణయం కాదన్న అభిప్రాయాన్నే ఇపుడు ఎక్కువ మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని పరిస్థితి వున్న నేపథ్యంలో ఆరు నెలల ముందు అభ్యర్థులను ప్రకటించి, వారిని ఆ ఆరునెలల పాటు ఏ పార్ఠీలోకి వెళ్ళకుండా కాపాడుకోవడం కష్టమేనన్నది పలువురి అభిప్రాయం. పార్టీ తరపున ప్రకటించిన అభ్యర్థే పార్టీ మారితే ఆ నియోజకవర్గంలోని పార్టీ వర్గాల్లో నైతిక స్థైర్యం సన్నగిల్లి ప్రతికూల ఫలితాలొస్తాయన్నది వారి అంచనా. అదేసమయంలో ఒకరిని పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే.. టిక్కెట్ ఆశించిన మిగిలిన నేతలు పార్టీ మారే ప్రమాదమూ లేకపోలేదన్నది వారి వాదన. ఇలా చింతన్ శివిర్ తర్వాత వ్యూహాలు రూపొందించుకోవాలనుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం.. మరిన్ని సందిగ్ధాలను కొనితెచ్చుకుందని సమాచారం. ఇలా తెలంగాణలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో మూడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.. పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu