Telangana Million March: ఆ అపురూప ఘట్టానికి సరిగ్గా పదేళ్లు.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన ‘జైతెలంగాణ’ ఆవాజ్
స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అదో కీలక ఘట్టం. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవం..
స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అదో కీలక ఘట్టం. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవం. ఉద్యమాల ఊట తెలంగాణ తోటలో పూసిన గులాబీ వనం. యావత్ దేశమే కాదు ప్రపంచ దేశాలను సైతం తనవైపుకు తిప్పుకున్న సందర్భం. తెలంగాణ సమాజాన్ని ఒక్క వేదిక మీదికి తెచ్చిన రోజు. దశాబ్దాల ఆవేశం, ఆక్రోశం కలగలిపిన ఉద్యమం విధ్వంసంగా మారిన క్షణమది. అంతే కాదు.. ఉద్యమ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. అదే మిలియన్ మార్చ్. పోలీసు బూట్ల కింద నలిగిన, లాఠీ దెబ్బలతో రక్తం నేలరాలిన దినానికి నేటికి పదేళ్లు.
అది మార్చి 10, రెండువేల పదకొండో సంవత్సరం. ఉద్యమ చరిత్రలో నిప్పు కణికలాంటి రోజు. స్వరాష్ర్ట కాంక్ష జ్వాలై రగిలిన రోజు. మహోద్యామాన్ని కీలక మలుపుతిప్పిన మహాదృశ్యం. ఆంక్షలు, నిర్బంధాల కట్టడిని చిత్తడి చేసిన ముట్టడి. దరువేస్తూ తెలంగాణ దండు కదిలింది.. బలవంతమైన సర్పం చలి చీమల చిక్కినట్టు… ఉద్యమకారుల ఎత్తుగడల ముందు ఖాకీ వ్యూహాలు చిత్తు చిత్తయ్యాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఆవాజ్ ట్యాంక్ బండ్ మీద కవాతు చేసింది. నవశకానికి.. తెలంగాణ సాధికారతకు దారి చూపిన రోజు మార్చి 10, 2011.
నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఉవ్వెత్తున సాగుతున్న తెలంగాణ ఉద్యమ అస్తిత్వానికి.. ఆకాంక్షకు లక్షల గొంతుకలు ఒక్కటై నినదించిన రోజు అది. ఆంక్షల పద్మవ్యూహాన్ని బద్దలుకొట్టుకుని లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ జనంతో ట్యాంక్ బండ్ ..జనసంద్రాన్ని తలపించింది. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా.. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. ఆనాడు మిలియన్ మార్చ్ ధాటికి పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు.
ఓ కెరటంలా ఎగిసి పడ్డ ఈ కార్యక్రమం ఉద్యమకారులకు, ప్రజలకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. తొలుత మిలియన్ మార్చ్‌కి చాలా భారీ ఎత్తున జరపాలనేది తెలంగాణ జేఏసీ వ్యూహం. అరబ్‌లో తేహ్రీ స్వ్కేర్ ముట్టడిని స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ ఈ మార్చ్‌కి ప్లాన్ చేశారు. అయితే మార్చి 10 న జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేస్తామన్న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, తరువాత మాటమార్చింది. ఒకానొక సందర్భంగా మార్చ్‌ని వాయిదా వేస్తారన్న చర్చ కూడా జరిగింది. ఇందుకు ససేమీరా అన్న.. జేఏసీలోని బీజేపీ, సీపీఐ, ఇతర ఉద్యోగ, ప్రజా సంఘాలు మార్చ్ జరిపే తీరాలని గట్టిగా పట్టుబట్టాయి. ప్రొఫెషర్ కోదండరామ్ ఆధ్వర్యంలో ఓ రోజంతా చర్చించిన జేఏసీ ఫైనల్‌గా ఓ ర్యాలీ చేపట్టాలని డిసైడ్ చేసింది. ప్రజల నుంచి మిలియన్ మార్చ్ ప్రచారానికి అపూర్వ స్పందన రావడంతో టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కూడా కలసికట్టుగా కదిలాయి.
మిలియన్ మార్చ్‌కు తెలంగాణ ఉద్యమకారులు ముందస్తు వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. పోలీసుల ఎత్తుగడలకు అంతు చిక్కని విధంగా వ్యూహాలు రూపొందించారు. మార్చ్‌ని ఫెయిల్ చేయాలని ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించింది. జిల్లాల బోర్డర్లలో పోలీసుల దిగ్భంధాలు, అడ్డంకులు, బ్యారికేడ్లు, ఇనుపకంచెలూ తెలంగాణ వాదులను ఆపలేకపోయాయి. నలుమూలల నుంచి వరదలా దూసుకొచ్చిన ఉద్యమకారుల నినాదాలతో మహానగరం ప్రతిధ్వనించింది..
మిలియన్ మార్చి కు ముందే చాలా మంది నేతలను జేఏసీ చైర్మన్ కోదండరాం ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే హరీశ్‌రావు తన సహచర ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డితో కలిసి బోట్‌లో హుస్సేన్‌సాగర్ మధ్య నుంచి ట్యాంక్ బండ్‌కు చేరడానికి ప్రయత్నించారు. మధ్యలో పోలీసులు అడ్డుపడటంతో నీటిలో దూకుతానంటూ బెదిరించారు. ట్యాంక్‌బండ్‌పైకి వచ్చిన నాటి కాంగ్రెస్ నేతలు కేకే, మధుయాష్కీల కార్లపై ఉద్యమకారులు దాడులకు దిగారు.
పోలీసులను, పారామిలటరీ బలగాలను మోహరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టలేనంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారు తెలంగాణ వాదులు. ఇందిరా పార్కు ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్ళి ఏర్పాట్లు చేసుకుని పెళ్ళి బృందంలా ట్యాంక్ బండ్ పైకి వచ్చారు. మధ్యాహ్నం వరకే 10 తెలంగాణ జిల్లాల్లో పోలీసుల నిర్బంధం తీవ్రమైంది. మొత్తం తెలంగాణలో లక్ష మంది ప్రజలను ముందస్తుగా అదుపులోకి తీసుకోగా, ఒక్క హైదరాబాదులోనే 11వేల మందిని అరెస్టు చేశారు .
అయితే.. ఈ మిలియన్ మార్చ్ కు వ్యూహరచన చేసిన కేసీఆర్ సాయంత్రం నాలుగు తర్వాత ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. పోతన విగ్రహం నుంచి మిలియన్ మార్చ్ కు వచ్చిన వారినుద్దేశించి మాట్లాడారు కేసీఆర్. జై తెలంగాణ నినాదాలు.. ఆటా పాటా..ఉద్యమ హోరుతో జంటనగరాలు ఊర్రూతలుగాయి. ఇంతింతై వటుడింతై అన్నట్టు చూస్తుండగానే సాగరతీరం జనసంద్రమైంది. కట్టడి చేసే క్రమంలో సిట్యుయేషన్ కంట్రోల్ తప్పింది…
విగ్రహాల ధ్వంసాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాక్షాలు లభించలేదు. విగ్రహాల విధ్వంసం తర్వాత ట్యాంక్ బండ్ మీద కొమరం భీం లాంటి తెలంగాణ హీరోల విగ్రహలు అక్కడ కొత్తగా చేరాయి. టీ జేఏసీ తర్వాత చేపట్టిన సాగరహారానికి మిలియన్ మార్చి స్ఫూర్తిగా నిలిచింది. ఈ ఘటనను బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రస్తావించాయి.
తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలు ట్యాంక్ బండ్ వేదికగా జరిగిన ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మిలియన్ మార్చ్‌లో కీలక పాత్ర పోషించారు. ఆనాటి ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా సబ్బండ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఆనాడు మిలియన్ మార్చ్‌కు తరలివచ్చి ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు ఆవశ్యకతను చాటారు.
అయితే మిలియన్ మార్చ్ నిర్వహించి నేటికి సరిగ్గా పదేండ్లు అవుతోంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ఆనాడు తాను మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న వీడియోను తన ట్విటర్ పేజీలో షేర్ చేశారు. మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న తెలంగాణ ప్రజలకు, వారి స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని కవిత ట్వీట్‌లో పేర్కొన్నారు. తమ మాతృభూమి కోసం అందరూ కలిసికట్టుగా నిలబడి, చరిత్ర సృష్టించామని కవిత తెలిపారు.
On the 10th anniversary of Million March, I salute the people and spirit of Telangana. United, we stood up for our motherland and created history! Jai Telangana !! Jai KCR !! pic.twitter.com/jEkDv4veJh
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 10, 2021
Read More: