AP Municipal Elections 2021: ఏపీలో ప్రశాంతంగా పోలింగ్.. విజయవాడలో పవన్ కల్యాణ్.. విశాఖలో విజయసాయిరెడ్డి ఓటు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో..
AP Municpal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ పోలీసుల బందోబస్తు మధ్య ప్రశాంతంగా కొనసాగుతుంది. కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబరు 4లో పవన్ ఓటు వేశారు. ఈ సందర్భంగా పవన్‌ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
అలాగే, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,214 డివిజన్, వార్డు స్థానాల్లో ఇప్పటికే 580 ఏకగ్రీవం కాగా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల బరిలో మొత్తం 7,549 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 77,73,231 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
రాష్ట్రంలో నాలుగు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 71 మునిసిపాలిటీలు, 12 నగర పాలక సంస్థల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్‌లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఓటింగ్ సరళి పరిశీలనలో భాగంగా విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్‌తో కలిసి సీవీఆర్ స్కూల్లో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఎస్ఈసీ పరిశీలించారు.
వృద్ధులు, యువకులు, మహిళా ఓటర్లతో ఆయన మాట్లాడారు. పోలింగ్, క్యూ లైన్లపై ఓటర్ల స్పందన అడిగి తెలుసుకున్నారు ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్‌ఈసీ విజ్ణప్తి చేశారు. ఓటు వేయడానికి 75 సంవత్సరాల టంకాశాల సుబ్బమ్మను ఆయన అభినందించారు. మీ లాంటి వారే సమాజానికి స్ఫూర్తి అని ఎస్‌ఈసీ అన్నారు.
ఓటు వేసిన విజయసాయిరెడ్డి:
విశాఖపట్నంమారుతీనగర్ పోలింగ్ బూత్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి సతీసమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 50వ నంబర్ పోలింగ్ బూత్‌కి వచ్చిన ఎమ్మెల్యే.. గంటసేపు క్యూలో నిల్చుని ఓటు వేశారు.
Read More: