AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Municipal Elections 2021: తిరుపతి కార్పొరేషన్‌లో ఇప్పటికే సగం స్థానాలు ఏకగ్రీవం.. గత అనుభవాలతో పోలీసుల గట్టి బందోబస్తు

చిత్తూరు జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు ఇటు అధికార పార్టీ వైసీపీకి, అటు ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో..

Municipal Elections 2021: తిరుపతి కార్పొరేషన్‌లో ఇప్పటికే సగం స్థానాలు ఏకగ్రీవం.. గత అనుభవాలతో పోలీసుల గట్టి బందోబస్తు
K Sammaiah
|

Updated on: Mar 10, 2021 | 8:50 AM

Share

AP Municipal Elections: చిత్తూరు జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు ఇటు అధికార పార్టీ వైసీపీకి, అటు ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఇక్కడి ఎన్నికలపై అధికార పార్టీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తన సత్తా చాటింది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ ఇచ్చింది. ఇక మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది వైసీపీ. ఈ నేపథ్యంలో తిరుపతి కార్పొరేషన్‌లో 50 డివిజన్లుండగా.. 22 ఇప్పటికే వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి.

తిరుపతి కార్పొరేషన్‌లోని ఏడో డివిజన్‌లో ఎన్నికలను నిలిపివేస్తూ ఇప్పటికే ఎస్‌ఈసీ ఆదేశాలిచ్చింది. ఇక మిగిలిన 27 డివిజన్లలో పోలింగ్‌ కొనసాగుతుంది. ఇక్కడ 21 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉండగా.. 10 చోట్ల గట్టి పోటీ ఇస్తున్నారు. మిగిలిన అభ్యర్థుల పోటీ నామమాత్రంగానే ఉంది. రెండు రోజులకు ముందే అన్ని డివిజన్లలోనూ ఆయా పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.వెయ్యి నుంచి రెండు వేల చొప్పున పంపిణీ చేసేశారనే ప్రచారం జరుగుతోంది. తిరుపతిలో 2, 3, 5, 9, 15, 16, 18, 20, 22, 23, 24, 25, 26, 28, 29, 31, 32, 33, 34, 35, 39, 41, 42, 43, 44, 49, 50 డివిజన్లలో పోలింగ్‌ కొనసాగుతుంది.

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటరు కార్డు లేనివారు ఏదైనా గుర్తింపు కార్డుతో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి హరి నారాయణన్‌ తెలిపారు. ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్‌ సెక్టార్‌, స్థానిక సంస్థలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు, పెన్షన్‌ డాక్యుమెంట్‌ పత్రాలు, పేమెంట్‌ ఆర్డర్‌ పత్రం, రిటైర్డ్‌ ఆర్మీ పెన్షన్‌ ఆర్డర్‌, వృద్ధాప్య, వితంతు, పెన్షన్‌కార్డులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. పాస్‌బుక్‌, భూమిపట్టా, బ్యాంకులు, పోస్టల్‌, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, రేషన్‌కార్డులు, అధికారి జారీ చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ద్రువీకరణ పత్రాలను సైతం అనుమతిస్తామన్నారు. అయితే ఈ కార్డులపై ఫొటో తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

పోలింగ్‌ సందర్భంగా ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 08572-242744, 242433, 242777 నెంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే వాట్సాప్‌ నెంబరు 7013158511తో పాటు ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టరేట్‌ అధికార వర్గాలు తెలిపాయి.

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్‌ సమయంలో అనుకోని సంఘటనలు ఎదురైతే.. భయపడకుండా సమర్థంగా ఎదుర్కోవాలని తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికల విధులు నిర్వహించే పోలీసులకు పలు సూచనలు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణలో వ్యవహరించాలని కోరారు.

Read More:

Municipal Elections 2021: కర్నూలులో సాఫీగా పోలింగ్‌.. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న కలెక్టర్‌