ఏపీ హోంమంత్రి ఒక బొమ్మ.. ఆ బొమ్మ కీ ఎవరి దగ్గరుందో అందరికీ తెలుసు.. టీడీపీ మహిళా నేత సంచలన కామెంట్స్
ఏపీ హోంమంత్రి సుచరితపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ హోంమంత్రి సుచరిత కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని..
ఏపీ హోంమంత్రి సుచరితపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ హోంమంత్రి సుచరిత కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని అన్నారు. ఆ బొమ్మకు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా సీఎం జగన్ కీ ఇస్తేనే ఆడుతుందని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత తీవ్రంగా విమర్శించారు. అంతే కాదు ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని అనిత వ్యాఖ్యానించారు. నరసరావుపేటకు చెందిన అనుషని హత్య చేసిన ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడి పేరు పక్కన రెడ్డి అని ఉంటే.. చర్యలు తీసుకోవడానికి పోలీసులు భయపడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు. రెడ్డి అని పక్కన తోక ఉంటే రాష్ట్రంలో ఏ అరాచకమైనా చేయవచ్చా అంటూ ప్రశ్నించారు.
దిశా చట్టం ఒక దిక్కుమాలిన చట్టమని, కనీసం దిశా చట్టం కూడా కరెక్టుగా తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమన్నారు అనిత. జగన్ ప్రభుత్వంలో మహిళల మానాలు, ప్రాణాలు రెండూ పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే జగన్ వస్తాడని ఊదరగొట్టారని, నరసరావుపేట అనూష కేసుపై జగన్ ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు.
అనూష కేసులో 21 రోజుల్లో నిందితుడుకి శిక్ష పడితే సీఎం జగన్‌కు సలాం చేస్తామన్నారు. ఒక విద్యార్థిని దారుణ హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు కనీసం స్పందించడా అంటూ వంగలపూడి అనిత నిలదీశారు. మొత్తానికి రాజకీయంగా కాక రేపుతున్న అనిత వ్యాఖ్యలపై వైసీపీ ఎలా స్పందిస్తుందోననే ఆసక్తి ఏపీ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Read more:
మార్చ్ 5న ఆంధ్రప్రదేశ్ బంద్.. సబ్బండ వర్గాలు మద్దతివ్వాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు