విశాఖ ఉక్కు ప్రవేటీకరణపై కార్మికుల ఆందోళనలు మిన్నంటాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉక్కు నగరం అట్టుడుకుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకంలో అవసరమైనప్పుడల్లా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపడంతో రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ కార్మికుల ముందు దోషిగా నిల్చుంది. ఈ నేపథ్యంలో కార్మికులు భవిష్యత్ ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. కార్మిక సంఘాల నిరసనలతో స్టీల్ సిటీ భగ్గుమంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గూడుపుఠాని బయటపడడంతో కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. జగన్, మోదీ ప్రభుత్వాలకు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. జీవీఎంసీ ఎన్నికలను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మెస్తున్నామన్న ప్రటకన తర్వాత ఉక్కు కర్మాగారం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు మరింత పెరిగాయి. కార్మిక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. అధికారులకు నిరసన తెగ తగిలింది. ఎక్కడికక్కడ అధికారుల కార్లను అడ్డగించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఊరుకునేదిలేదని, ఎంతవరకైనా వెళతామని, ప్రాణాలు సయితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆందోళనకారులు స్పష్టం చేశారు.
అయితే కేంద్రం తాజా వివరణతో ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని తేలిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్నది రాజకీయ పార్టీల చేతుల్లో ఉంది. ఇప్పటికే పార్టీలకు అతీతంగా విశాఖ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. బీజీపీ, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే అధికార వైసీపీ మాత్రం కేంద్రాన్ని ఒప్పించగలం అనే ధీమాతో కనిపించింది. ఇటు జనసేన సైతం కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందని ఆశపడింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో ఆ రెండు పార్టీలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయనేది ఆసక్తిగా మారింది ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ అంశంపై ప్రధానికి సీఎం జగన్ మరోసారి లేఖ రాశారని, స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సీఎం జగన్ కోరినట్లు వెల్లడించారు. అఖిలపక్షాన్ని, కార్మిక సంఘం నేతలను తీసుకొస్తానని లేఖలో పేర్కొన్నారని తెలిపారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ కేంద్ర పరిధిలోని అంశమని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై సీఎం జగన్ పలు సూచనలు కూడా చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రా సెంటిమెంట్‌లో ఒక భాగమని చెప్పారు. విశాఖ ఉక్కుపై పవన్ కల్యాణ్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
Read More:
జీవీఎంసీ ఎన్నికలను బహిష్కరించిన కార్మిక సంఘాలు.. ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్న యూనియన్లు