అసెంబ్లీ కాదంటే… లోక్‌సభ రమ్మంది..
వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, అయితేనేం పట్టుదలతో ఓటమి నుంచి తేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగి విజయం సాధించారు. ప్రజల్లో వారికున్నపట్టుకు నిదర్శనం. తెలంగాణలో తాజాగా వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు ప్రముఖులు… మళ్లీ స్వల్ప వ్యవధిలోనే పుంజుకుని ఎంపీ అభ్యర్ధులుగా పోటీచేసి గెలుపొందారు. వారు ఎవరో తెలుసుకోండి. రేవంత్ రెడ్డి.. కొడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున రెండుసార్లు గెలుపొంది ఫైర్ బ్రాండ్ లీడర్‌గా […]
వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, అయితేనేం పట్టుదలతో ఓటమి నుంచి తేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగి విజయం సాధించారు. ప్రజల్లో వారికున్నపట్టుకు నిదర్శనం. తెలంగాణలో తాజాగా వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు ప్రముఖులు… మళ్లీ స్వల్ప వ్యవధిలోనే పుంజుకుని ఎంపీ అభ్యర్ధులుగా పోటీచేసి గెలుపొందారు. వారు ఎవరో తెలుసుకోండి.
రేవంత్ రెడ్డి..
కొడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున రెండుసార్లు గెలుపొంది ఫైర్ బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి భారీ తేడాతో ఓటమి చవిచూశారు. అయితే పట్టువీడకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వంపై విరుచుకుపడుతూ తన గొంతును బలంగా వినిపించారు. దీంతో ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసినా.. మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..
నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌గా వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తరఫున నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినా ఓటమి భారంతో కుంగిపోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
కిషన్ రెడ్డి…
తెలంగాణ కమలదళానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి సత్తాచాటారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కిషన్ రెడ్డి… 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా పట్టు వదలకుండా పార్టీ కేడర్‌ను ఉత్సాహపరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అది గుర్తించిన కమలదళం సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయను పక్కనబెట్టి కిషన్ రెడ్డిని సికింద్రాబాద్ లోక్‌స్థానం నుంచి బరిలో దించింది. కిషన్ రెడ్డికి ఉన్న గుర్తింపుతోపాటు సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీకి ఉన్నపట్టుతో ఆయన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ పై గెలుపొందారు.
బండి సంజయ్…
ఇక కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ భారీ తేడాతో ఓటమి చవిచూశారు. అయినా ఎక్కడా నిరాశ పడకుండా పార్టీ కేడర్‌లో ధైర్యం నూరిపోస్తూ అగ్రనాయకత్వం ఆశీస్సులతో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కేంద్రం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, మోదీ ప్రభుత్వ పథకాలే ప్రచారం అస్త్రాలుగా ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. స్థానికంగా మంచి పట్టుఉండటంతో బండిసంజయ్.. సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్‌పై విజయం సాధించి కరీంనగర్ కోటపై కాషాయజెండా ఎగురవేశారు.
నేతగాని వెంకటేష్…
పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి నేతగాని వెంకటేష్ విజయం సాధించారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన వెంకటేష్… బాల్క సుమన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఆయన పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ పై విజయం సాధించారు.