PRESIDENT POLLS: ఆసక్తి రేపుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ద్విముఖమా లేక త్రిముఖమా? కాంగ్రేసేతర, బీజేపీయేతర అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్
ఎన్డీయే, యుపీఏ అభ్యర్థులు మాత్రమే వుంటారా లేక రెండు కూటములకు సమాన దూరం పాటించే పార్టీల తరపున మూడో అభ్యర్థి బరిలోకి వస్తారా అన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి రాజకీయ విశ్లేషకులు...
PRESIDENT POLLS BECOMING INTERESTING NDA UPA ALLIANCES GEARING UP: రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. ఏ అద్భుతమో జరిగితే గానీ ఎన్డీయే అభ్యర్థి భారత తదుపరి రాష్ట్రపతిగా ఎన్నిక అవడం ఖాయం. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే(NDA) ఆధిపత్యం. కానీ మేజిక్ మార్కుకు 1.2 శాతం ఓట్ల దూరంలో వుంది ఎన్డీయే. మిత్రపక్షం అన్నాడిఎంకే, తటస్థ పార్టీలు వైసీపీ(YSRCP), బీజూ జనతాదళ్(Biju Janata Dal) మద్దతు ఇస్తాయన్న విశ్వాసంతో బీజేపీ (BJP)అధినాయకత్వం భరోసా వుంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi), కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా(Amit Shah) ఏఐఏడిఎంకే, వైసీపీ,బీజేడీలతో సంప్రదింపులు ప్రారంభించారన్న కథనాలు వస్తున్నాయి. 2017 నాటి రాష్ట్రపతి ఎన్నికల సమయంలో పార్టీల సమన్వయం బాధ్యతలను ఆనాటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు(Venkaiah Naidu), అరుణ్ జైట్లీ(Arun Jaitley), రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) చూసుకున్నారు. దళిత నాయకుడు, హిందూ వాదనలకు కాస్త దూరం పాటించే బీహారీ నేత రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind)ను రాష్ట్రపతిని చేశారానాడు. ప్రస్తుతం కూడా గిరిజన నేతను ప్రెసిడెంటు రేసులోకి తీసుకువచ్చేందుకు కమలం నేతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న కథనాలు నిజమైతే ఒడిశాకు చెందిన గిరిజన నేత, మాజీ మంత్రి, మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము భారత దేశానికి కాబోయే రాష్ట్రపతి అనుకోవచ్చు. కానీ అధికారిక ప్రకటన వచ్చే దాకా దీనిని కేవలం ఊహాగానంగా మాత్రమే చూడాలి. అయితే, బరిలో ఎన్డీయే, యుపీఏ అభ్యర్థులు మాత్రమే వుంటారా లేక రెండు కూటములకు సమాన దూరం పాటించే పార్టీల తరపున మూడో అభ్యర్థి బరిలోకి వస్తారా అన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి రాజకీయ విశ్లేషకులు రకరకాల విశ్లేషణలు వివరిస్తున్నారు.
అధికార బీజేపీ యత్నాలు, వ్యూహాలు ఓపక్క కొనసాగుతుంటే ప్రతిపక్షాలు కూడా రాష్ట్రపతి ఎన్నికపై దృష్టి సారించాయి. యుపీఏ పక్షాలతో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు ప్రారంభించింది. గెలిచే అవకాశాలు పెద్దగా లేకపోయినప్పటికీ.. ప్రెసిడెంటు పోల్‌లో బీజేపీకి కేక్ వాక్ ఛాన్సివ్వకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకత్వం.. యుపీఏ పక్షాలతోపాటు కలిసి వచ్చే తటస్థ పార్టీలతోను సంప్రదింపులు జరపబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరుకునపెట్టడంతోపాటు కశ్మీరీలకు ఉన్నత స్థానం అధిష్టించే అవకాశం వుందని చాటేందుకు సీనియర్ రాజకీయ దిగ్గజం, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ అభ్యర్థిత్వాన్ని కూడా బీజేపీ పరిశీలిస్తున్న అంశాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం సునిశితంగా గమనిస్తోంది. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి ప్రకటించిన జీ-23 బృందంలో గులాం నబీ ఆజాద్ వున్నప్పటికీ ఆయన్ను కపిల్ సిబల్ వంటి నేతలతో జతకట్టి వివక్షతో చూడడం లేదు కాంగ్రెస్ అధినేత్రి. దాంతో ఆయన మొన్నటి చింతన్ శిబిర్‌లో కాస్త చురుకుగానే వ్యవహరించారు. అయితే.. రాజ్యసభ నుంచి రిటైర్ అయిన సమయంలో గులాం నబీ ఆజాద్ పట్ల ప్రధాని మోదీ సుహృద్భావంతో ప్రసంగించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్నఆజాద్.. తాను చేపట్టిన ప్రతీ పదవికి న్యాయం చేకూర్చారని కామెంట్ చేశారు. అప్పటి నుంచి ఆజాద్‌ను రాష్ట్రపతి పదవికి బీజేపీ ప్రతిపాదించబోతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. నిజానికి ఆజాద్ అభ్యర్థిత్వానికి బీజేపీ సానుకూలంగా స్పందిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇరకాటం తప్పదు. ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆజాద్ అభ్యర్థిత్వాన్ని సపోర్టు చేయడమా ? లేక బీజేపీ ప్రతిపాదించింది కాబట్టి వ్యతిరేకించడమా అన్న మీమాంస తప్పదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. ఇదిలా వుంటే.. కాంగ్రెస్ పార్టీ యుపీఏ పార్టీలతోపాటు తటస్థ పార్టీల మద్దతు కోసం చేసే ప్రయత్నాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కలిసి వచ్చే అవకాశం వుంది. ఇటు ఏపీలో అధికార పార్టీ వైసీపీగానీ, ఒడిశాలో అధికార పార్టీ బిజూ జనతాదళ్ పార్టీగానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశాలు లేవు. ఇక తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కూడా కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కోసం యత్నాలు చేస్తున్న తరుణంలో రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏం చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనన్న నినాదాన్ని తెలంగాణ బీజేపీ నేతలు ఉధృతం చేస్తారు. అదేసమయంలో బీజేపీపై తీవ్రస్థాయిలో కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఎన్డీయే అభ్యర్థికి గులాబీ పార్టీ మద్దతిచ్చే అవకాశాలు దాదాపు శూన్యం.
ఇక గులాబీ బాస్ కదలికలు.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో తాజా మంతనాల నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలపై కూడా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. నిజానికి గత రెండు, మూడు నెలలుగా కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి కోసం పలువురిని కలుస్తూ వస్తున్నారు. కర్నాటకకు వెళ్ళినపుడు మాజీ ప్రధాని దేవెగౌడను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే.. కేసీఆర్ వ్యూహాల లోతు అంతుచిక్కడం కష్టం అని తెలిసిన దేవెగౌడ దానిని సున్నితంగా తిరస్కరించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దానికి 2004 టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తును దేవెగౌడ ఉటంకించినట్లు సమాచారం. ఇక అవినీతిపై గతంలో ఉద్యమించిన సామాజిక వేత్త అన్నా హజారే అభ్యర్థిత్వాన్ని కూడా కేసీఆర్ కొందరి ముందు ప్రస్తావించినట్లు కూడా పత్రికల్లో వార్తలొచ్చాయి. ఇందుకోసం మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దికి కేసీఆర్ స్వయంగా వెళ్ళి హజారేను ఒప్పిస్తారని అన్నారు. ఇందుకు మే 27వ తేదీని ముహూర్తంగా కూడా కొందరు పేర్కొన్నారు. కారణాలు తెలియదు గానీ కేసీఆర్ అన్నా హజారేను కలవలేదింకా. ఢిల్లీలో చాలా రోజులు గడిపిన కేసీఆర్.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ని, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌ని, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌లతో భేటీ అయ్యారు. తన ప్రతిపాదనలను వారి ముందుంచారు. అంతకు ముందు చెన్నై వెళ్ళి స్టాలిన్‌తోను భేటీ అయ్యారాయన. ఇదే క్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలుస్తారని అన్నా.. అదింకా కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో కాంగ్రేసేతర, బీజేపీయేతర రాష్ట్రపతి అభ్యర్థి ప్రతిపాదన ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందో ఇపుడే చెప్పలేని పరిస్థితి. మొత్తమ్మీద రాష్ట్రపతి ఎన్నికలు ఎన్డీయే, యుపీఏ అభ్యర్థుల మధ్య ముఖాముఖీ జరుగుతాయా ? లేక కాంగ్రేసేతర, బీజేపీయేతర కూటమి తరపున మూడో వ్యక్తి రంగంలోకి ప్రవేశిస్తారా వేచి చూడాల్సిందే.