AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు ఎంఐఎం వ్యతిరేకం.. విశాఖ స్టీల్‌పై పార్లమెంటులో పోరాడతా -అసదుద్దీన్‌ ఒవైసీ

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయాలనే..

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు ఎంఐఎం వ్యతిరేకం.. విశాఖ స్టీల్‌పై పార్లమెంటులో పోరాడతా -అసదుద్దీన్‌ ఒవైసీ
K Sammaiah
|

Updated on: Mar 05, 2021 | 6:19 PM

Share

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కార్మిక సంఘాల నుంచి నిరసనలు ఉధృతరూపం దల్చాయి. వివిధ కార్మిక సంఘాలు రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేపడుతున్నాయి. ఉద్యమంలో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ బంద్‌ సంపూర్ణంగా కొనసాగింది. ఏపీ బంద్‌కు అధికార పార్టీ వైసీపీతో సహా పలు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు తమ వ్యతిరేకతను చాటాయి. ఈ క్రమంలో మజ్లీస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కార్మికులకు మద్దతు ప్రకటించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయాలనే కేంద్ర నిర్ణయం తగదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను ఖండిస్తున్నానని అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆదోని పట్టణానికి బయలుదేరిన ఆయన.. మార్గమధ్యంలో కోడుమూరు పట్టణంలో ఆగి అక్కడ శాంతియుతంగా బంద్‌ను పాటిస్తున్న కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.

విశాఖపట్టణానికి ఉక్కు పరిశ్రమ రావడానికి ఎంతో మంది బలిదానం చేశారని అసదుద్దీన్‌ గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దాన్ని బయటి వ్యక్తులకు కట్టబెట్టే నిర్ణయాన్ని కేం‍ద్ర ప్రభుత్వం విరమించుకోవాలని హెచ్చరించారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్థావించి, కేంద్రంపై ఒత్తిడి తెస్తానని హామీనిచ్చారు. అయితే పాతబస్తీ పార్టీగా ముద్రపడిన ఎంఐఎం పార్టీ ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పలు స్థానాల్లో విజయం సాధించారు. ఆదోని మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున పలువురు అభ్యర్ధులు రంగంలో నిలిచారు. వీరికి మద్దతుగా ప్రచారం చేసేందుకు అసదుద్దీన్‌ ఆదోనికి వెళ్లారు.

Read More:

అందుకే అప్పులు చేయాల్సి వచ్చింది.. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది -బుగ్గన

సాగర్‌ ఉప పోరుపై స్ట్రాటజీ మార్చిన గులాబీ బాస్‌.. ఇంతకీ ఆ ఐదుగురలో అధినేత ఆశీర్వాదం ఎవరికి..?