Asssam Elections: అస్సాంలో బీజేపీది అదే దూకుడు.. 92 స్థానాల్లో పోటీ.. సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్

అస్సాం ఎన్నికల్లో బీజేపీ తనదైన భిన్న శైలిలో దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే మిత్ర పక్షాలతో సీట్ల సర్దుబాటును పూర్తి చేసింది. గతంలో కన్నా ఎక్కువ స్థానాలలో బీజేపీ పోటీకి దిగుతోంది. బీజేపీ తరపున ఇద్దరు సీఎం క్యాండిడేట్స్ కనిపిస్తుండడంతో ప్రజల్లో క్యూరియాసిటీ కనిపిస్తోంది.

Asssam Elections: అస్సాంలో బీజేపీది అదే దూకుడు.. 92 స్థానాల్లో పోటీ.. సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్
Follow us

|

Updated on: Mar 05, 2021 | 7:20 PM

BJP successfully completed seat sharing in Assam: అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి దూకుడు ప్రదర్శిస్తోంది. గతంలో పోటీ చేసిన సీట్లకంటే ఎక్కువ స్థానాల్లో పోటీకి దిగింది. ఇందుకోసం తన మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటును విజయవంతంగా ముగించింది. ఈసారి బిజెపి 92 స్థానాలకు పోటీ చేస్తుంది. అదే సమయంలో, తన మిత్రపక్షమైన అసోమ్ గణ పరిషత్‌ (ఏజీపీ)కి 26 సీట్లు, పీపుల్స్ పార్టీ లిబరల్స్‌కు 8 సీట్లు కేటాయించింది. బిజెపి తన అభ్యర్థులను ఇంకా ప్రకటించనప్పటికీ సీట్ల సర్దుబాటును మాత్రం పూర్తి చేసుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమ సిఎం అభ్యర్థి ఎవరు అన్న విషయంపై బిజెపి ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. వాస్తవానికి సర్బానంద సోనోవాల్, హేమంత్ బిస్వా శర్మల పేర్లు ప్రజల్లో నానుతున్నాయి. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఘన విజయం సాధించిన బీజేపీ అక్కడ అయిదేళ్ళ పాటు ప్రభుత్వంలో కొనసాగింది.

ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతోనే బిజెపి ఎన్నికలలో గెలవడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తుంది. అందుకే ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును బిజెపి ప్రకటించడం లేదు. అయితే, ఈ ఎన్నికల్లో బిజెపి మళ్లీ విజయం సాధిస్తే, అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కొనసాగుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే, ఆయన నాయకత్వంలోనే ఈశాన్య రాష్ట్రంలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే.

భారతీయ జనతా పార్టీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 89 సీట్లలో పోటీ చేసింది. ఇందులో 60 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అదే సమయంలో, బీజేపీ మిత్రపక్షమైన ఏజీపీ 14 స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ కూడా ఆ సమయంలో ఎన్డీఏలో వుండింది. ఆపార్టీ 12 సీట్లు గెలుచుకుంది. ఈసారి బిజెపి మునుపటి కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తోంది. గతంలో 89 సీట్లలో పోటీ చేయగా.. ఈసారి 92 సీట్లలో పోటీ చేస్తోంది. బోడోలాండ్‌లో యుపిపిఎల్ తన బలాన్ని పెంచుకుంటోంది. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బిపిఎఫ్) అక్కడ బలహీనపడుతోంది. 2020లో బిజెపి ఇండియా బోడో స్టూడెంట్స్ యూనియన్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ అనే రెండు సంస్థలను ఏకం చేసింది. యుపిపిఎల్ అధినేత ప్రమోద్ బోరా దీనిలో కీలక పాత్ర పోషించారు. యుపిపిఎల్‌తో పాటు బోడోలాండ్ ప్రాంతంలో కూడా బిజెపి తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది.

అస్సాంలో బిజెపి మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలిగితే, శర్మకు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే ఛాన్స్ వుంది. మోడీ పేరు మీద బిజెపికి మరోసారి విజయం దక్కితే.. అందులో శర్మ పాత్ర పెద్దదే అవుతుంది. అప్పుడు క్రెడిట్ ముఖ్యమంత్రి సోనోవాల్‌కు దక్కే అవకాశం లేదు. ప్రస్తుతం, అస్సాంతో సహా మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు మే 2 కోసం అందరూ వేచివున్నారు. శర్మ బిజెపిలో ఎంతగానో కలిసిపోయారు. ఆయన ఆర్ఎస్ఎస్ భాషను, ముఖ్యంగా పౌరసత్వ చట్టం, హిందూ ఆత్మగౌరవం పేరిట మాట్లాడుతున్నారు. అందువల్ల, బిజెపి విజయం సాధిస్తే హేమంత్ బిస్వా శర్మను సీఎం సీటు వరిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.

వాస్తవానికి, అస్సాంలో 36 శాతం ముస్లిం జనాభా వుంది. 33 అసెంబ్లీ సీట్లలో వీరు అధికంగా ఉన్నారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్, ఎయుయుడిఎఫ్ మధ్య ఓట్లు చీలేవి. అయితే, ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల రంగంలోకి దిగాయి. దాంతో ముస్లిం ఓట్లు చీలే అవకాశాలు తగ్గాయి. ముస్లిం ఓట్లు పోలరైజ్ అయ్యేలా బద్రుద్దీన్ ప్రయత్నిస్తున్నారు. ముస్లిం ఓటు బ్యాంకును గంపగుత్తగా కాంగ్రెస్, ఎయుయుడిఎఫ్‌లకు పడేలా వ్యూహరచన చేస్తున్నారు. ఇది జరిగితే అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం కష్టతరమవుతుంది.

2016 లో అస్సాం గెలిచిన తరువాత, బిజెపి కీలక నేత సర్బానంద సోనోవాల్‌ను ముఖ్యమంత్రిని చేశారు. అయితే ఈసారి బిజెపి సీఎం పేరు ప్రస్తావించకుండా ఎన్నికల బరిలోకి దిగింది. మోడీ చరిష్మా మీదనే ఎక్కువగా బీజేపీ ఆధారపడుతోంది. సర్బానంద సోనోవాల్‌పై కొందరు స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహంగా వున్నారు. హిమంత బిస్వా శర్మ పదునైన ప్రకటనలు చేస్తూ అస్సాం రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. దాంతో ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే విషయం ప్రజల్లో ఆసక్తి రేపుతోంది.

ALSO READ: ఏపీ విద్యార్థినులకు సీఎం జగన్ బంపర్ గిఫ్ట్.. మహిళా దినోత్సవం రోజునే..!

ALSO READ: కరోనా వైరస్ వైఫైలాగా మన చుట్టే వుంది..  సీసీఎంబీ తాజా హెచ్చరిక

ALSO READ: ఆరేళ్ళలో ఎన్నో బందులు.. కానీ నేటిది మాత్రం ప్రత్యేకమే!

ALSO READ: ఇపుడు అందరి కళ్ళు ఆయనపైనే.. ఎందుకంటే సడన్‌గా సీఎం కేండిడేట్ అయ్యాడు కదా!