కొండగట్టుకు కల్వకుంట్ల కవిత.. హనుమాన్ చాలిసా పారాయణం ప్రారంభించనున్న ఎమ్మెల్సీ.. వారికి జైహనుమాన్‌తో చెక్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఆలయంలో నేటి నుంచి జరిగే అఖండ అనుమాన్ చాలిసా..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఆలయంలో నేటి నుంచి జరిగే అఖండ అనుమాన్ చాలిసా పారాయణ కార్యక్రమాన్ని కవిత ప్రారంభిస్తారు. హనుమాన్ ఆలయంలో రామకోటి పుస్తకాలను సమర్పించి.. ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం హనుమాన్ చాలిసా పారాయణం ఉంటుంది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో పాటు పలువురు నేతలు పాల్గొంటారు.
తెలంగాణ వ్యాప్తంగా కొండగట్టుతో పాటు 3,200 హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ చాలిసా పారాయణం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 80 రోజుల పాటు హనుమాన్ చాలిసా పారాయణం కొనసాగుతుంది. హునుమాన్ జయంతి రోజైన జూన్ 4న ముగుస్తుంది. అన్ని ఆలయాల్లో సాయంత్రం 05.30 నుంచి 06.30 వరకు హనుమాన్ చాలిసా పారాయణం చేస్తారు. ఇందుకోసం అన్ని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మనిషి తన శారీరక, మానసిక రుగ్మతల నుంచి బయట పడేందుకు భగవంతుడిని తదేకంగా ధ్యానించడమే ఏకైక మార్గం. అలాంటి ఆధ్యాత్మికతను పెంచేందుకు నేటి నుంచి కొండగట్టుపై అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభం కాబోతున్నది. రెండు మండలాలు అంటే 82 రోజుల పాటు కొనసాగిన తర్వాత రామకోటి స్తూప ప్రతిష్ఠాపనోత్సవం చేస్తారు. అందుకు కొండగట్టు అంజన్న సేవా సమితి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
ఈ నెల 18న హనుమాన్ చిన్న జయంత్యుత్సవాల సందర్భంగా హనుమాన్ దీక్షా స్వీకారోత్సవాలు మొదలై, హనుమాన్ పెద్ద జయంతి జూన్ 4వ తేదీ వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఈ సందర్భంగా కొండగట్టు పుణ్యక్షేత్రంపై నేటి నుంచి 82 రోజులు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.. కొండపై భక్తులు, అర్చకులు కలిసి పదకొండు సార్లు పారాయణం చేస్తారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాల్లోనూ పారాయణం చేయాలని కొండగట్టు అంజన్న సేవా సమితి పిలుపునిచ్చింది. కొండపై నిత్యం నిర్వహించే పారాయణాన్ని భక్తి చానళ్ల ద్వారా గంటపాటు ప్రసారం చేసేందుకు నిర్ణయించింది. భక్తులు తమ ఇండ్లలోనూ పారాయణం చేయాలని సూచించింది.
కొండగట్టులో దక్షిణ భారతంలోనే తొలి రామకోటి స్తూపం
దక్షిణ భారతదేశంలోనే తొలి రామకోటి స్తూపాన్ని ప్రతిష్ఠించాలని కొండగట్టు అంజన్న సేవా సమితి సభ్యులు సంకల్పించారు. 90 లక్షల వ్యయంతో అత్యద్భుతంగా 23 అడుగుల ఎత్తుతో కొండపైన నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 9న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణరెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి భూమిపూజ చేశారు. రెండు, మూడు రోజుల్లో స్తూప నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 5 కోట్ల రామ నామ లిఖితాలు ఉండగా, వీటన్నింటినీ కొండగట్టుపైకి చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పారాయణం జరిగే 82 రోజుల వ్యవధిలో మరో 6 కోట్ల రామనామ లిఖిత ప్రతులను భక్తుల నుంచి సేకరించనున్నారు. జూన్ 4న హనుమాన్ పెద్ద జయంతి రోజు మొత్తం 11 కోట్ల రామకోటి లిఖిత ప్రతులతో స్తూపాన్ని ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పది ఉమ్మడి జిల్లాలకు ఉత్సవ విగ్రహం..
రాష్ట్ర వ్యాప్తంగా పూర్వ ఉమ్మడి పది జిల్లాల్లో అంజన్న ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించాలని కొండగట్టు అంజన్న సేవా సమితి నిర్ణయించింది. చాలీసా పారాయణం ప్రారంభమైన తర్వాత ప్రత్యేక రథంపై అంజన్న ఉత్సవ విగ్రహాన్ని ఉంచి, వారానికో ఉమ్మడి జిల్లాలో రథయాత్ర నిర్వహించనున్నారు. రథయాత్ర సందర్భంగా హనుమాన్ చాలీసాను పంపిణీ చేయడం, స్వామివారి తీర్థ ప్రసాదాన్ని భక్తులకు అందజేయడం, ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడం, భక్తులు రాసిన రామకోటి ప్రతులను స్వీకరించడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు.
వరుసగా కొండగట్టు దర్శనంపై రాజకీయ కోణం
తెలంగాణలో బీజేపీ జైశ్రీరామ్ నినాదంతో దూసుకెళ్తోంది. ఇటీవలే రామ మందిర నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు చేపట్టారు. ఊరూరా జైశ్రీరామ్ నినాదం మోర్మోగింది. అంతేకాదు పశ్చిమ బెంగాల్‌లో రామనామాన్ని జపాన్నే జపిస్తోంది బీజేపీ. అదే నినాదంతో తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే దుబ్బాకతో పాటు జీహెచ్ఎంసీ ఫలితాలతో జోష్ మీదుంది బీజేపీ. ఈ క్రమంలో బీజేపీకి చెక్ పెట్టేందుకే టీఆర్ఎస్ జై హనుమాన్ నినాదాన్ని అందుకుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే హనుమాన్ చాలిసా పారాయాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More:
సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ… బడ్జెట్‌కు ఆమోద ముద్ర.. ఆ కీలక నిర్ణయాలకు పచ్చజెండా..?