AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ భేటీ… బడ్జెట్‌కు ఆమోద ముద్ర.. ఆ కీలక నిర్ణయాలకు పచ్చజెండా..?

తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాత్రి ఏడు గంటలకు ప్రగతిభవన్‌లో..

సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ భేటీ... బడ్జెట్‌కు ఆమోద ముద్ర.. ఆ కీలక నిర్ణయాలకు పచ్చజెండా..?
K Sammaiah
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 17, 2021 | 9:27 AM

Share

తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాత్రి ఏడు గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2021-22 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ సహా పలు కీలక నిర్ణయాలపై మంత్రివర్గం చర్చంచి ఆమోదముద్ర వేయనుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ, వయోపరిమితి పెంపు తదితర అంశాలపైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఆ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ వ్యూహంపైనా సీఎం కేసీఆర్‌ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా రాష్ట్ర కేబినెట్‌ సమావేశం చివరగా 2020 నవంబరు 13న సమావేశమైంది. ఆ తర్వాత జరిగే సమావేశం ఇదే కానుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

రేపు ఉదయం శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. దీని కంటే కొన్ని గంటల ముందు మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి ఆమోదముద్ర వేయాలని మొదట్లో ప్రభుత్వం భావించింది. అయితే బడ్జెట్‌తో పాటు ఇతర అంశాలు ఉండడం, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ రావడంతో మంత్రిమండలి సమావేశాన్ని బుధవారమే నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

మంత్రివర్గం సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ పద్దులకు కేటాయింపులు ఇతర అంశాలను మంత్రులకు సీఎం కేసీఆర్‌ తెలియజేస్తారు. కొత్త బడ్జెట్‌లో ప్రాధాన్యాలను వివరిస్తారు. అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిని వివరిస్తారు.అయితే సమావేశ సమయానికి ఎమ్మెల్సీ ఫలితాలపై అంచనాలు, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల వారితో సీఎం సమావేశమై కొత్త వేతన సవరణ తదితర హామీలు ఇచ్చారు. వీటిపైనా కేబినెట్‌ భేటీలో సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వ ఎజెండా అనంతరం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం కేసీఆర్‌ సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల లెక్కింపు ఇప్పటికే ప్రారంభమైంది. మంత్రిమండలి సమావేశం జరిగే సమయానికి ఫలితాలపై కొంత స్పష్టత రానుంది. ఈ ఎన్నికల్లో మంత్రుల పని తీరును సీఎం కేసీఆర్‌ ప్రస్తావించే అవకాశం ఉంది.

ఇక నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ తిరిగి గెలుచుకోవడంపై సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సుదీర్ఘ కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. 7 మండలాలు, రెండు పురపాలికల్లో ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జులుగా నియమించింది.

ఇక అభ్యర్థి విషయంలో ఇంతకాలం వేచి చూసిన గులాబీ బాస్‌ తుది లిస్టును తయారు చేసినట్లు సమాచారం. స్థానిక నేతలు గురవయ్య, రంజిత్‌, శ్రీనివాస్‌యాదవ్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్లు గులాబీవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి టికెట్‌ను ఆశిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక, ప్రచారంపైనా కేబినెట్‌ భేటీలో మంత్రులతో చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read More:

లోటస్‌పాండ్‌ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్‌.. తాను ఎవరి బాణాన్ని కాదన్న వైయస్ షర్మిల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం.. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం