AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీఎంకేను చీల్చేటంత సీన్‌ అళగిరికి ఉందా? దక్షిణ తమిళనాడులోని పది జిల్లాల పార్టీ క్యాడర్‌ అళగిరి మాటే వింటుందా?

తమిళనాడులో రాజకీయాలు ఊపందుకున్నాయి.. మరో ఆరు నెలలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధానపార్టీలన్నీ సంసిద్ధమవుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే డీఎంకే మాజీ నేత అళగిరి..

డీఎంకేను చీల్చేటంత సీన్‌ అళగిరికి ఉందా? దక్షిణ తమిళనాడులోని పది జిల్లాల పార్టీ క్యాడర్‌ అళగిరి మాటే వింటుందా?
Balu
|

Updated on: Nov 16, 2020 | 2:43 PM

Share

తమిళనాడులో రాజకీయాలు ఊపందుకున్నాయి.. మరో ఆరు నెలలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధానపార్టీలన్నీ సంసిద్ధమవుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే డీఎంకే మాజీ నేత అళగిరి ఈ నెల 20న మదురై కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.. సమావేశానికి హాజరుకావాల్సిందిగా దక్షిణ తమిళనాడులో ఉన్న ముఖ్య నేతలకు, కార్యకర్తలకు పిలుపిచ్చారు.. అళగిరి నిర్ణయంతో డీఎంకే క్యాడర్‌ కాస్త కంగారుపడుతున్నా.. అళగిరికి డీఎంకే పార్టీని చీల్చేటంత బలం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. పార్టీ పగ్గాల కోసం అన్నదమ్ములు కొట్టుకోవడం ఇది మొదలు కాదు.. కరుణానిధి బతికున్నపుడే పార్టీలో పెద్ద స్థానం కోసం అళగిరి మొండిపట్టుపట్టారు.. అళిగిరి మనస్తత్వం తెలిసే కరుణానిధి ఆయనను పార్టీకి దూరంగా పెట్టారు..అసలు అళగిరికి, స్టాలిన్‌కు అస్సలు పడదు.. ఎవరు చెప్పినా వినేరకం కాదు అళగిరి.. డీఎంకేలో వారసత్వ పోరు గురించి చెప్పుకోవడానికి ముందు అళగిరి గురించి తెలుసుకోవాలి.. కరుణానిధి రెండో భార్య దయాళూ అమ్మాల్‌ పెద్దకొడుకు అళగిరి.. 1950లో పుట్టిన అళగిరి బీఏ వరకు చదివారు. మొండిఘటం. చెబితే వినేరకం కాదు. కొంచెం రౌడీ లక్షణాలు కూడా ఉన్నాయి.. తమ్ముడు స్టాలిన్‌ అంటే ఈర్ష్య. ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. అన్నదమ్ముల మధ్య గొడవలతో కరుణానిధి విసిగిపోయారు.. ఇందుకు పరిష్కారం ఇద్దరిని వేరు చేయడమేనని అనుకున్నారు. అందుకే అళగిరికి నచ్చజెప్పి దక్షిణ తమిళనాడుకు పంపించేశారు.. దక్షిణ తమిళనాడులో డీఎంకే బలహీనంగా ఉందని, అంచేత నువ్వు మదురైకి వెళ్లి అక్కడే కాపురం పెట్టి, పార్టీ పత్రిక మురసొలి సర్క్యులేషన్‌ను పెంచి, పార్టీని బలోపేతం చేయమని చెప్పి పంపారు కరుణానిధి. తండ్రి చెప్పిన మాటలు అళగిరికి పాజిటివ్‌గా అనిపించాయి.. వెంటనే మదురైకి వెళ్లి కాపురం పెట్టేశారు.. ఏమాటకామాట చెప్పుకోవాల. దక్షిణ తమిళనాడులో డీఎంకే బలపడటానికి అళగిరి ఎంతో పాటుపడ్డారు. మదురై నుంచి కింద ప్రాంతమంతా తన ఏలుబడిలోకి వచ్చిందనే భావనలో ఉండేవారు.. కరుణానిధి బతికున్నప్పుడే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు.. స్టాలిన్‌తో చీటికిమాటికి గొడవలు పెట్టుకున్నారు. అప్పుడప్పుడు తండ్రిని కూడా ఎదిరించారు. మరికాసేపటికే తండ్రికి విధేయుడిని అని చెప్పుకుని రాజీపడేవారు.. ఈయన బాధ బాధ పడలేక కేంద్రమంత్రిగా చేసి ఢిల్లీ పంపేసినా, ఆయన అక్కడ నెగ్గుకు రాలేకపోయాడు. అళగిరి వ్యవహారం తలనొప్పిగా మారడంతో ఆయనను పార్టీలోంచి తొలగించారు కరుణానిధి.. పార్టీ నుంచి తనను తొలగించినా తాను మాత్రం వేరే పార్టీ పెట్టనంటూ తండ్రి పట్ల భక్తిని చాటుకున్నారు. అయినప్పటికీ స్టాలిన్‌ మీద కోపంతో ఎన్నికలలో పార్టీని ఓడించడానికి ప్రయత్నించారు. డీఎంకే అభ్యర్థులను ఓడించాలంటూ తన అనుచరులకు పిలుపు కూడా ఇచ్చారు.మరోవైపు స్టాలిన్‌ రాజకీయపుటెత్తుగడలతో అళగిరికి ఎప్పటికప్పుడు చెక్‌ పెట్టుకుంటూ వచ్చారు.. 1953లో పుట్టిన స్టాలిన్‌ కూడా బీఏ వరకు చదివారు.. కరుణానిధికి స్టాలిన్‌ అంటేనే ఇష్టం.. మద్రాస్‌ మేయర్‌గా కూడా పనిచేశారు.. చేస్తే చేశారు కానీ అవసరమైన చోటల్లా ఫ్లయిఓవర్లు కట్టేసి కేసుల్లో ఇరుకున్నారు.. అళిగిరితో పోలిస్తే స్టాలిన్‌ చాలా పాలిష్‌డ్‌ పొలిటిషియన్‌. తండ్రి చనిపోయినప్పటి నుంచి క్యాడర్‌ను గ్రిప్‌లో ఉంచుకోగలిగారు..మధ్యమధ్యలో సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా.. పార్టీకి సురక్షితంగా కాపాడుకుంటూ రాగలిగారు.. సీనియర్లు కినుక వహించడానికి కారణం స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి.. సినిమాలతో పాటు పార్టీ వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకుంటుంటారు.. ఇక స్టాలిన్‌కు సెందామరై అనే కూతురు కూడా ఉన్నారు.. అన్నట్టు దయాళూ అమ్మాల్‌కు తమిళరసు అనే మరో కుమారుడు కూడా ఉన్నారు.. ఆయన రాజకీయాలకు బహుదూరం. వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. కరుణానిధి తదనంతరం అళగిరి, స్టాలిన్‌ తప్పనిసరిగా రాజకీయ వారసత్వం కోసం కొట్టుకుంటారని అందరూ అనుకున్నదే. కాకపోతే కొంచెం ఆలస్యమయ్యింది అంతే! మధ్యలో సయోధ్య కోసం స్టాలిన్‌ ప్రయత్నించారు కానీ క్యాడర్‌ ఒప్పుకోలేదు.. ఇప్పుడు అళగిరి సమావేశం పెట్టడం వల్ల డీఎంకే రెండు ముక్కలవుతుందా? దక్షిణ తమిళనాడులోని పది జిల్లాలలో అళగిరి ప్రభావం చూపగలరా? ఎంత మేరకు పార్టీని చీల్చగలరు? అన్నది చూడాలి!