రైతు చట్టాల సవరణకు మేం ఓకె, కానీ అన్నదాతలే ముందుకు రావట్లేదు, కేంద్ర మంత్రి తోమర్

రైతు చట్టాల సవరణకు ప్రభుత్వం సిధ్ధంగానే ఉందని, కానీ ఇందుకు అన్నదాతలు అంగీకరించడంలేదని కేంద్ర వ్యవసాయ  శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. 11 దఫాలుగా వారితో చర్చలు జరిపామని, చట్టాలను సవరిస్తామని హామీ ఇచ్చామని అయన చెప్పారు.

  • Umakanth Rao
  • Publish Date - 6:17 pm, Sun, 7 March 21
రైతు చట్టాల సవరణకు మేం ఓకె, కానీ అన్నదాతలే ముందుకు రావట్లేదు, కేంద్ర మంత్రి తోమర్

రైతు చట్టాల సవరణకు ప్రభుత్వం సిధ్ధంగానే ఉందని, కానీ ఇందుకు అన్నదాతలు అంగీకరించడంలేదని కేంద్ర వ్యవసాయ  శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. 11 దఫాలుగా వారితో చర్చలు జరిపామని, చట్టాలను సవరిస్తామని హామీ ఇచ్చామని అయన చెప్పారు. అగ్రివిజన్ 5వ జాతీయ సదస్సులో మాట్లాడిన ఆయన.. రైతులు ఇన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారని, కానీ ఇది వారికి  ఎలా ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెంచడానికి, రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించుకోవడానికి అనువుగా వ్యవసాయ చట్టాలను తెచ్చామే తప్ప వారికి  చేటు తేవడానికి కాదని చెప్పారు. అందువల్లే పార్లమెంట్ వీటిని ఆమోదించిందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునని, కానీ దేశానికి అవి హాని చేసేవిగా ఉండరాదని తోమర్ చెప్పారు. ఈ నిరసనలు రైతుల ప్రయోజనాలకు ఎలా ఉపయోగపడతాయో ఎవరూ  చెప్పడం లేదన్నారు.

ప్రతిపక్షాలు వీరి ఆందోళనను తమలబ్దికి ఉపయోగించుకుంటున్నాయని తోమర్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను గానీ, వీటిని రైతులు కోరుకున్నట్టు సవరిస్తే వారికీ ఒనగూడే ఫలితాల గురించి గానీ విపక్షాలు వారికీ వివరించలేకపోతున్నాయని ఆయన మండిపడ్డారు. వారిని రెచ్ఛగొట్టడమే పనిగా పెట్టుకున్నాయన్నారు.పెద్ద, ప్రధాన సంస్కరణలను తెచ్చినపుడు ఎప్పుడూ వ్యతిరేకత అంటూ ఉంటుందని, కానీ ప్రభుత్వ విధానాలు, పాలసీలు సరైనవే అయినప్పుడు ఆ సంస్కరణలను అంగీకరించాల్సి ఉంటుందని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ప్రధాని మోదీ ఎంతో ముందు చూపుతో ఈ రైతు చట్టాలను తెచ్చారు. వారికి  ఇవి చాలా తోడ్పడగలవని భావించే అయన అమలులోకి తెస్తే వీటిని వ్యతిరేకించడం ఎంతవరకు సబబని తోమర్ ప్రశ్నించారు.కాగా ఈ మూడు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీంకోర్టు గత జనవరి 12 న స్టే జారీ చేసింది. మరి ఈ విషయమై తోమర్ ఎందుకు ప్రస్తావించడంలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  అన్నదాతలు ఇప్పటికీ నిరసనబాటను వీడలేదు కూడా.. ఢిల్లీ శివార్లలోని బోర్డర్లో వారి టెంట్లు అలాగే ఉన్నాయి. పంట పనుల కోసం చాలామంది తమ గ్రామాలకు వెళ్లినా రైతు సంఘాలు పిలిస్తే మళ్ళీ వేలాది రైతులు ఆ బోర్డర్ కి చేరుకునేందుకు రెడీగా ఉన్నారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

IT Raids: తమిళనాడులో ఐటీ రైడ్స్.. బయటపడిన వేయి కోట్ల అక్రమాస్తులు.. ఎక్కడెక్కడ దాడులు జరిపారంటే..?

Telangana Minister KTR : బీజేపీ నేతలు వాటిపై ప్రశ్నించరేం?.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్..