Telangana Minister KTR : బీజేపీ నేతలు వాటిపై ప్రశ్నించరేం?.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్..

రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైయ్యాయి? రూ.2 లక్షల 72 వేల కోట్లు కేంద్రానికి పన్నులు కడితే మనకు వచ్చింది సగమే. దీనిపై ప్రశ్నించరేం?..

  • Shiva Prajapati
  • Publish Date - 6:14 pm, Sun, 7 March 21
Telangana Minister KTR : బీజేపీ నేతలు వాటిపై ప్రశ్నించరేం?.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్..

Telangana Minister KTR : ‘కలం వీరులకు మేము రుణపడి ఉంటాం’ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. డిసెంబర్ 23వ తేదీ వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందన్నారు. జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు.. ఆ బాధ్యతను తానే వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని చెప్పారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టు అడ్డంకులు ఉన్నాయని, వాటిని తాను దగ్గరుడి పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. ‘ఉద్యోగులతో, జర్నలిస్టులతో మాది పేగు బంధం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కలం వీరులకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. అదికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆనాటి నుంచి ఈనాటి వరకు తమకు అండగా ఉన్న వారందరికీ శాయశక్తులా, ఇతోధికంగా సహాయం చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

జర్నలిస్టుల కోసం వంద కోట్ల సంక్షేమ నిధి ఇచ్చిన రాష్ట్రం దేశంలో ఏ రాష్టమైనా ఉందా? అని మంత్రి కేటీఆర్ అన్నారు. 260 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కోక్కరికి లక్ష రూపాయల చెక్కులు ఇచ్చామని తెలిపారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. తమది సంస్కారవంతమైన ప్రభుత్వం అని, 500 మంది అసహాయ జర్నలిస్టులకు రూ. 50 వేలు ఆర్థిక సహాయం చేశామని చెప్పారు. కరోనా సంక్షోభం సమయంలో 1950 మందికి కరోనా సహాయం అందించామన్నారు. ఇప్పటికే పదికోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో 5900 మందికి శిక్షణ ఇచ్చామని వివరించారు. ఇక రూ. 15 కోట్లతో మీడియా అకాడమీ కార్యాలయ భవనాన్ని ఐదు అంతస్థుల్లో నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే త్వరలోనే జర్నలిస్ట్ యూనియన్ కార్యాలయానికి సొంత స్థలం కేటాయిస్తామని చెప్పారు.

గుజరాత్‌లో వెయ్యి మంది గుర్తింపు పొందిన జర్నలిస్టులు ఉంటే తెలంగాణలో 19500 మంది ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులు ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హెల్త్ స్కీంలో కొన్ని లోపాలు ఉన్నాయని, నాణ్యమైన హెల్త్ స్కీం త్వరలో తీసుకువస్తామని చెప్పారు. కాగా, 61,500 మందికి రూ. 25 కోట్ల విలువైన సర్జరీలు, వైద్య సేవలు చేయించామని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో జర్నలిస్టుల ఆశీర్వాదం, ఆశీస్సులు టీఆర్ఎస్‌కు ఉండాలని మంత్రి కేటీఆర్ కోరారు.

వాటిపై ప్రశ్నించరేం?..
ఇదే సమయంలో విపక్ష నేతల తీరుపైనా మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘నేడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. దుబ్బాకలో అడ్డిమారి గుడ్డిగా బీజేపీ గెలిచింది. దానికే ఎగిరెగిరిపడుతున్నారు. మరి మేమెంత ఎగిరి పడాలి. కేసీఆర్ మాట్లాడటం మళ్లీ స్టార్ట్ చేస్తే ఎవరూ తట్టుకోలేరు. ఆయన మాటలు తట్టుకోవాలంటే ఎన్ని గుండెలు కావాలి?. మోడీ, అమిత్ షా మీద కేసీఆర్ మాట్లాడితే బీజేపీ నేతలు తట్టుకోలేరు. ఎలా మాట్లాడాలనే అంశంలో కేసీఆర్ మాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ సంస్కారంతోనే మేం మాట్లాడుతున్నాం. ప్రశ్నించే గొంతుక అంటున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తీసేస్తే ఒక్కరూ ప్రశ్నించరేంటి?. ఏదైనా అడిగితే దేశం కోసం.. ధర్మం కోసం అంటున్నారు. ఎవరి దేశం కోసం? రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైయ్యాయి? ఇప్పటి వరకు రూ.2 లక్షల 72 వేల కోట్లు కేంద్రానికి పన్నులు కడితే మనకు వచ్చింది సగమే. దీనిపై వారు ప్రశ్నించరేం?’ అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్.

అసలు టీఆర్ఎస్ పార్టీ లేకపోతే టి.కాంగ్రెస్, టి. బీజేపీ లు ఎక్కడివి? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నాడు గంజిలో ఈగ లాగా ఆంధ్ర నాయకత్వం తెలంగాణ వాళ్లను తీసేశారన్న ఆయన.. తెలంగాణ వాళ్లను ఎప్పుడూ వారి పార్టీలు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరి ఉద్యోగాలు పోయి నిరుద్యోగులు అయ్యారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో కరెంట్ సమస్య పోయిందని కేటీఆర్ అన్నారు. ఇంటింటికి నీరు వచ్చిందని, ఫ్లోరోసిస్ బాధ పోయిందన్నారు. ఆరేళ్లలో పది మెడికల్ కాలేజీలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. త్వరలోనే 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Also read:

Minister Perni Nani: చంద్రబాబు ఆ ట్రాన్స్ నుంచి బయటకు రావాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని..

ముంబై-ఆర్‌సీబీ పోరుతో ఐపీఎల్-2021 మొదలు.. ముగింపు నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్​ 2021 ఫైనల్