కడపజిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు చేస్తే కూల్చేస్తామని హెచ్చరించారు బీజేపీ సీనియర్ నేత విష్ణు వర్ధన్ రెడ్డి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు వ్యవహారంపై బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గలం అవుతున్నారు. టిప్పుసుల్తాన్ విగ్రహం కూల్చివేతతోనే మీ పతనం మొదలు అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టి ఆ తర్వాత అఫ్జల్ గురు విగ్రహం కూడా పెట్టడానికి సిద్ధం అవుతారని అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి టిప్పు సుల్తాన్, కసబ్, అఫ్జల్ గురు లాంటి వారు దేశ భక్తులుగా కనిపిస్తున్నారని విమర్శించారు. ఆ తర్వాత వీరి చరిత్రని పాఠ్య పుస్తకాల లో చేర్చండి అంటూ ఎద్దేవ చేశారు.
ప్రొద్దుటూరులో విగ్రహ ఏర్పాటు చేయడానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే స్థానిక ఎమ్మెల్యే ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. బీజేపీకి చరిత్ర తెలియదని అంటున్న ఎమ్మెల్యే రాచమల్లు తమతో చర్చకు సిద్దమా అంటూ సవాల్ చేశారు. మీ దగ్గర ఉన్న చరిత్ర పుస్తకాలను తీసుకొని రండి చర్చిద్దాం… ముందు జిన్నా రోడ్డులోని జిన్నా పేరుని తొలగించాలని డిమాండ్ చేశారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు కొసం టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వెనుక తప్పకుండా ఏదో కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఎమ్మెల్యే రాచమల్లు వ్యవహారం ఉందన్నారు. ప్రొద్దుటూరు మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరుతున్నాయని విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.
ఇప్పటికే కర్నాటకలో టిప్పుసుల్తాన్ జయంతి కార్యక్రమాల్ని వ్యతిరేకిస్తున్న కమలం నేతలు.. ఇప్పుడు జగన్ సొంత జిల్లాలో, అదీ వైసీపీ ఎమ్మెల్యే సాయంతో ఏర్పాటవుతున్న విగ్రహంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం రోజు రోజుకు మరింత వేడిని రాజేసిలా ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.