బీజేపీకి సపోర్టా ? ప్రసక్తే లేదు.. కుమారస్వామి
కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి తమ పార్టీ ఎమ్మెల్యేలలో కొంతమంది బయటినుంచి మద్దతునివ్వడానికి సుముఖంగా ఉన్నారని వచ్చిన వార్తలను మాజీ సీఎం, జేడీ-ఎస్ అధినేత కుమారస్వామి ఖండించారు. నూతన ముఖ్యమంత్రి ఎదియూరప్ప ప్రభుత్వానికి తమ పార్టీ సభ్యులు కొందరు బయటి నుంచి సపోర్ట్ ఇస్తారని జేడీ-ఎస్ ఎమ్మెల్యే జి.టి.దేవెగౌడ ఇటీవల ఓ పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే ఇందుకు అవకాశం లేదని కుమారస్వామి పేర్కొన్నారు. ‘ మేం బీజేపీతో చేతులు కలుపుతామని వార్తలు వచ్చాయి. కానీ […]

కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి తమ పార్టీ ఎమ్మెల్యేలలో కొంతమంది బయటినుంచి మద్దతునివ్వడానికి సుముఖంగా ఉన్నారని వచ్చిన వార్తలను మాజీ సీఎం, జేడీ-ఎస్ అధినేత కుమారస్వామి ఖండించారు. నూతన ముఖ్యమంత్రి ఎదియూరప్ప ప్రభుత్వానికి తమ పార్టీ సభ్యులు కొందరు బయటి నుంచి సపోర్ట్ ఇస్తారని జేడీ-ఎస్ ఎమ్మెల్యే జి.టి.దేవెగౌడ ఇటీవల ఓ పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే ఇందుకు అవకాశం లేదని కుమారస్వామి పేర్కొన్నారు. ‘ మేం బీజేపీతో చేతులు కలుపుతామని వార్తలు వచ్చాయి. కానీ ఇవి నిరాధారమైనవి. ఈ వదంతులను మా పార్టీ కార్యకర్తలు, నాయకులు నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజా సంక్షేమం కోసం మా పోరాటాన్ని కొనసాగిస్తాం అని ఆయన చెప్పారు. జి.టి. దేవెగౌడ వ్యాఖ్యలను జేడీ-ఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ కూడా తోసిపుచ్చారు. తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని, ఒక ప్రాంతీయ పార్టీగా ఏ పార్టీని ఎప్పుడు ఎలా వ్యతిరేకించాలో అప్పుడు వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. ఎదియూరప్ప రాష్ట్రానికి మంచి చేస్తే మేము హర్షిస్తామన్నారు. ఇక కొత్త సీఎం ఎదియూరప్ప సోమవారం విశ్వాస పరీక్ష నెదుర్కొనున్నారు.




