మెదక్ జిల్లాలో నర్సాపూర్‌లో ఒకప్పుడు తిరుగులేని హవా కొనసాగించింది కాంగ్రెస్. కానీ, ఇప్పుడు.. సీన్ మొత్తం రివర్స్ . పార్టీకి కంచుకోటలాంటి నియోజకవర్గంలో… సరైన నాయకుడు కూడా దొరకని పరిస్థితి హస్తానిది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టపడి,కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నా… వారికి దశ, దిశను నిర్ధేశించే నాయకత్వం కరువైంది. దీంతో, హస్తవాసి ఎప్పటికైనా మారకపోతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్న క్యాడర్.. రోజురోజుకూ నైరాశ్యంలో కూరుకుపోతోంది.
పక్కోడి పెత్తనం అక్కర్లేదంటున్న క్యాడర్!
ఇక్కడ సరైన లీడర్ లేకపోవడంతో…పక్క నియోజకవర్గాల నేతల కన్ను నర్సాపూర్‌పై పడుతోంది. ఈసారి నర్సాపూర్ లో పోటీ చేసేందుకు పఠాన్ చెర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్… గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే, నియోజ కవర్గంలో పర్యటనలు మొదలెట్టేశారు అనిల్. అయితే, ఆయన వ్యవహారాన్ని లోకల్‌గా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం నాయకుడి పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారట. అలాంటి నేతల అజమాయిషీని ఏమాత్రం సహించబోమంటున్నారట.
కాంగ్రెస్‌నుంచి సునీతారెడ్డి హ్యాట్రిక్ విక్టరీ!
నర్సాపూర్ లో కాంగ్రెస్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy). వైఎస్ హయాంలో రెండుసార్లూ మంత్రిగానూ పనిచేశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత వరుసగా రెండు సార్లు… టిఆర్ఎస్ అభ్యర్థి మదన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన సునీతారెడ్డి… ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, సునీత వెళ్లిపోవడంతో.. నర్సాపూర్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే తగిలింది. రెండుసార్లు ఓడినా… సునీత ఉన్నంత వరకూ కాంగ్రెస్ బలంగానే ఉంది. ఎప్పుడైతే ఆమె కారెక్కేశారో.. అప్పుడే హస్తం అస్తవ్యస్థమైంది.
కాంగ్రెస్‌లో భర్తీకాని సునీతారెడ్డి స్థానం!
నర్సాపూర్ కాంగ్రెస్‌లో సునీతలక్ష్మారెడ్డి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేక పోయారంటే… అక్కడ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదే అదనుగా.. పక్క నియోజకవర్గం నేతలు నర్సాపూర్ పై కన్నేశారు. దీంతో, లోకల్‌గా ఉన్న కొందరు లీడర్లు, కార్యకర్తలు.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ.. ఏదైనా నిరసనకు పిలుపునిచ్చినా… లోకల్ క్యాడర్ పట్టించుకోవడం లేదట. మరి, నియోజకవర్గంపై కన్నేసిన వలసనేతలకు కాంగ్రెస్ క్యాడర్ సహకరిస్తుందా? పార్టీ మళ్లీ ట్రాక్ ఎక్కుతుందా? చూడాలి.