- Telugu News Photo Gallery World photos Pakistan finally relents allows import of sugar cotton from india after nearly two years photo story
India – Pakistan : దారిలోకొచ్చిన దాయాది దేశం… భారత్ నుంచి షుగర్, కాటన్ దిగుమతులకు పాక్ గ్రీన్ సిగ్నల్
Pakistan finally relents : పాకిస్తాన్ ప్రజలు భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుంటున్నారని ఖాన్, ప్రధాని నరేంద్రమోదీకి తన లేఖలో పేర్కొన్నారు..
Updated on: Mar 31, 2021 | 10:58 PM

దాయాది దేశం ఎట్టేకలకు దారికొచ్చింది. దాదాపు రెండేళ్ల నిషేధానికి తిలోదకాలిస్తూ భారతదేశం నుండి చక్కెర, పత్తిని దిగుమతి చేసుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతిచ్చింది.

పాకిస్తాన్ ఇక మీదట భారతదేశం నుండి షుగర్, కాటన్ దిగుమతి చేసుకుంటుందని ఆ దేశ ఆర్థిక మంత్రి హమ్మద్ అజార్ బుధవారం ప్రకటించారు. దీంతో భారత్ నుంచి దిగుమతుల పాకిస్తాన్ విధించిన నిషేధం 19 నెలల తర్వాత ఎత్తివేసినట్లైంది.

అంతేకాదు, ఈ ఏడాది జూన్ నుంచి పాకిస్తాన్ పత్తిని కూడా భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుందని పాక్ ఆర్థిక మంత్రి చెప్పారు. "భారతదేశం నుండి పత్తి దిగుమతి నిషేధించడం కారణంగా అది తమ SME లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిందని మంత్రి తెలిపారు.

వాస్తవానికి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు కాగా, రెండవ పెద్ద చక్కెర ఉత్పత్తి చేసే దేశం. 2019 వరకు, భారతీయ పత్తిని ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలలో పాకిస్తాన్ ఒకటి. అయితే, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను భారత ప్రభుత్వం రద్దు చేసిన తరువాత ఇస్లామాబాద్.. భారతదేశం నుండి ఆయా వస్తువుల దిగుమతిని నిషేధించింది.

పాకిస్తాన్ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం, దీనికి ప్రతిగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ మరో లేఖ రాయడం తెలిసిందే. ఈ సుహృద్భావ వాతావరణం ఏర్పడ్డ తర్వాతి రోజే ఈ కీలక వాణిజ్య పరిణామం చోటు చేసుకోవడం విశేషం.



