World Dosa Day: ‘వరల్డ్ దోస డే’!.. నిమిషానికి స్విగ్గీ ఎన్ని దోశలు డెలివరీ చేస్తుందో తెల్సా.?
మార్చి -3 ప్రపంచ దోశ దినోత్సవం. ఇదేంటి దోసక్కూడా ఒక స్పెషల్ డే నా? అనుకుంటున్నారా? అంతలా పాపులర్ అయిపోయింది మరి ఈ దక్షిణ భారతదేశ వంటకం. భారతీయులు ఎవరైనా అల్పాహారంలో మొదటి ప్రిఫరెన్స్ ఇడ్లీకి, దోసకే ఇస్తారు.
Updated on: Mar 03, 2024 | 8:30 PM

మార్చి -3 ప్రపంచ దోశ దినోత్సవం. ఇదేంటి దోసక్కూడా ఒక స్పెషల్ డే నా? అనుకుంటున్నారా? అంతలా పాపులర్ అయిపోయింది మరి ఈ దక్షిణ భారతదేశ వంటకం. భారతీయులు ఎవరైనా అల్పాహారంలో మొదటి ప్రిఫరెన్స్ ఇడ్లీకి, దోసకే ఇస్తారు. రకరకాల పద్ధతుల్లో తయారుచేసుకునే ఈ దోసను ప్రపంచమంతా ఎంతో ఇష్టంగా తింటుంది.

అందుకే దీనికో ప్రత్యేక రోజును కూడా కేటాయించారు. ఈ దోస ఎక్కడ ఎలా పుట్టిందనేదానికి సరైన ఆధారాలు లేవుకానీ.. మొత్తానికి ప్రపంచమంతా తనదే అన్నట్టుగా వరల్డ్ ఫేమస్ అయిపోయింది. బియ్యం, మినపప్పు కలిపి నానబెట్టి, వాటిని మెత్తగా రుబ్బిన మిశ్రమంతో దీనిని తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో క్రిస్పీగా చేస్తే.. కొందరు సాఫ్ట్‌గా చేస్తారు.

ఒక సర్వే ప్రకారం..ఫుడ్ డెలీవరీ సంస్థ స్విగ్గీ 2023 నుంచి 2024 వరకు దాదాపు 29 మిలియన్ల దోసలను డెలివరీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతేగాదు ఒక నిమిషానికి 122 దోసలను బ్రేక్ ఫాస్ట్‌గా డెలీవరి చేస్తున్నట్లు వెల్లడయ్యింది. బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలాంటి మహా నగరాలు ఈ దోసకు క్యాపిటల్‌గా నిలిచాయంటే అర్ధం చేసుకోవచ్చు. అక్కడ రోజుకి లక్షల్లో దోస ఆర్డర్లు వస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.

మొదటగా ఈ దోశ తమిళనాడులో తయారు చేసినట్టు తెలుస్తోంది. అక్కడ ఈ దోసెను మందంగా మెత్తగా చేసేవారు. ఆ తర్వాత కర్నాటకలో క్రిస్పీగా ఉండే దోసెను తయారు చేయడం మొదలు పెట్టారు.

ఓ రెస్టారెంట్ దోసెను క్రిస్పీగా అందించేది. స్వాతంత్య్రానంతరం దోసె క్రేజ్ దేశమంతటా వ్యాపించింది. ఆ తర్వాత ఉత్తర భారతీయులు కూడా ఈ వంటకాన్ని ఇష్టంగా తినడం స్టార్ట్ చేశారు. ఈ దక్షిణ భారత వంటకాన్ని ఢిల్లీలో ఓ మద్రాస్ హోటల్ అక్కడి వారికి పరిచయం చేసింది.

ఇక ఆహార ప్రియులు దోసెలను ఇష్టంగా ఆస్వాదించడంతో ఇక చెఫ్‌లు రకరకాల దోసెలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మసాలా దోస, పనీర్ దోస, మైసూర్ మసాలా దోస, చీజ్ దోస, స్కీజ్వాన్ దోస వంటి రకరకాల దోస రెసిపీలు మార్కెట్లోకి వచ్చేశాయి. అలాగే వీటిని కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ వంటి వివిధ రకాల చట్నీలతో చెఫ్‌లు నోరూరించేలా అందించడంతో మరింతగా ప్రజాదరణ పొందింది.

ఒకటవ శతాబ్దానికి చెందిన సంగం సాహిత్యంలో దోస గురించి ఉంది. ఇక క్రీస్తు శకం వెయ్యేళ్ల క్రితం ప్రాచీన తమిళంలో ఈ దోసలను తయారు చేసినట్లు ఆహార చరిత్రకారుడు కేటీ అచాయ పేర్కొన్నాడు.

ఇక ప్రసిద్ధ చరిత్రకారుడు పి తంకప్పన్ నాయర్ ప్రకారం ఈ దోస కర్ణాటకలోని ఉడిపి అనే పట్టణంలో ఫస్ట్ తయారైంది అంటారు. వీటన్నింటిని పరిగణలోనికి తీసుకుంటే దోస మూలం ఎక్కడ అనేది ఓ మిస్టరీగా మిగిలిపోయింది.




