- Telugu News Photo Gallery Weather: IMD issues red alert for extremely heavy rainfall in several districts of Andhra Pradesh, Telangana
Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Updated on: Sep 08, 2024 | 8:36 PM

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది.. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే.. భారీ వర్షాలు, వరదలతో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇటు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి..

ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో తీవ్ర వాయుగుండం బలపడబోతోందని.. పూరీ- దిఘా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో.. వచ్చే రెండు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా.. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఈ నాలుగు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కొనసాగుతోంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణలో కూడా మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయిని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, కొమురంభీం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్ జిల్లాకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

అలాగే.. పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి, వికారాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్డ్ జారీ చేసింది. భారీ వర్షాల కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
