- Telugu News Photo Gallery TSRTC launching e garuda electric buses between hyderabad and vijaywada today
Hyderabad: హైదరాబాద్ – విజయవాడ మధ్యలో ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్.. ప్రతి 20 నిమిషాలకు ఒకటి. పూర్తి వివరాలు
పర్యావరణ రహితమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా తెలంగాణ ఆర్టీసీ మరో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మంగళవారం నుంచి ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ - గరుడ పేరుతో రానున్న ఈ బస్సులను మంగళవారం మియాపూర్‌లో ప్రారంభించనున్నారు..
Updated on: May 16, 2023 | 8:16 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వీటిలో 10 బస్సులు (నేటి నుంచి) మంగళవారం అందుబాటులోకి రానున్నాయి. మిగతా బస్సులు ఈ ఏడాది చివరినాటికి విడతల వారీగా అందుబాటులోకి రానున్నాయి.

ఈ బస్సులకు ‘ఈ-గరుడ’ అని పేరు పెట్టారు. హైటెక్ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ బస్సులు హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకొకటి అందుబాటులో ఉండనున్నాయి. రాబోయే రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని తెలంగాణ ఆర్టీసీ తెలిపింది.

మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్ఫక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ బస్సుల ప్రారంభోత్సవానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ “ఈ-గరుడ” బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఇక ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రత్యేకతల విషయానికొస్తే.. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేయడం జరిగింది.

వెహికిల్ ట్రాకింగ్ సిస్టం, ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ ఏర్పాటు చేస్తారు. ఇది టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూంనకు కనెక్ట్ అవుతుంది. ప్రతి బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బస్సులోని ప్రయాణికులను లెక్కించే ఆటోమెటిక్ ప్యాసింజర్ కౌంటర్ (ఏపీసీ) కెమెరా కూడా ఉంది.

అలాగే బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్)ను ఏర్పాటు చేశారు. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.





























