Titanic: వందేళ్ల క్రితం మునిగిన టైటానిక్.. సముద్రపు అడుగున ఇప్పుడెలా ఉందో చూశారా? కొత్త 3D ఫొటోలు..
మాగెల్లాన్ లిమిటెడ్ చేసిన డీప్-సీ మ్యాపింగ్ ద్వారా టైటానిక్ శిథిలాల కొత్త 3D స్కాన్ చిత్రాలు బయటపడ్డాయి. 12,500 అడుగుల లోతులో ఉన్న శిధిలాల స్థితి గురించి ఈ చిత్రాలు వివరిస్తాయి. టైటానిక్ శిథిలాలు వేగంగా క్షీణిస్తున్నాయని, రానున్న 40 ఏళ్ళలో అదృశ్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్‌లో పూర్తి ఫుటేజ్‌ను చూడవచ్చు.
Updated on: Apr 09, 2025 | 7:01 PM

అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీకొని టైటానిక్ షిప్ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి 100 ఏళ్లకు పైగానే అవుతోంది. అయితే.. సముద్రపు అడుగున ఇప్పుడు ఆ నౌక ఎలా ఉంది అనే విషయాలను తెలుపుతూ.. డీప్-సీ మ్యాపింగ్ కంపెనీ మాగెల్లాన్ లిమిటెడ్ నిపుణులు సముద్ర ఉపరితలం నుండి దాదాపు 12,500 అడుగుల దిగువన శిథిలమైన టైటానిక్ షిప్ ఫొటోలను తీసి, విడుదల చేశారు. (Images Credit: Magellan Deep Sea Mapping)

బ్రిటిష్ కంపెనీ వైట్ స్టార్ లైన్ యాజమాన్యానికి చెందిన ఈ భారీ షిప్.. సముద్రంలో మునిగిపోవడంతో 1,517 మంది మరణించారు. ప్రమాద సమయంలో టైటానిక్‌లో మొత్తం 2,224 మంది ఉన్నారు. లైఫ్ బోట్ల సాయంతో కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు.

RMS టైటానిక్ ఏప్రిల్ 10, 1912న సౌతాంప్టన్ నుండి తన ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత మంచు కొండను ఢీ కొట్టి రెండు ముక్కలై.. సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు దాని అవశేషాలు కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 350 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు అడుగుభాగంలో ఉన్నాయి.

అయితే, టైటానిక్ శిథిలాలు సముద్రపు అడుగున చాలా వేగంగా క్షీణిస్తున్నాయి. రాబోయే 40 సంవత్సరాలలో టైటానిక్ పూర్తిగా అదృశ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ భారీ షిప్ మునిగిపోయి చాలా కాలం అవుతున్నా.. కొత్తగా వచ్చిన ఈ త్రీడీ స్కాన్ చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పూర్తి ఫుటేజ్‌ను ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం రాత్రి 8 గంటలకు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్‌లో టైటానిక్: ది డిజిటల్ రిసరెక్షన్‌లో చూడవచ్చు.
