- Telugu News Photo Gallery Telangana's ancient Perani dance is going to be performed for the first time in New York, America
Telangana: విదేశాలకు విస్తరించిన తెలంగాణ కళ.. తొలిసారి అమెరికా గడ్డపై
పేరణి నృత్యం తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక. కాకతీయుల కాలంలో వినోదాన్ని అందిస్తూ యుద్దాన్ని ఎలా నడపాలో అద్భుతంగా చూపించిన కళాఖండం. ఈ నృత్యాన్ని ఇప్పటికీ చాలా మంది వివిధ వేదికలపై ప్రదర్శిస్తూ తెలంగాణ సంస్కృతిని, కళలను కాపాడుతూ వస్తున్నారు. తమ కడుపుకు కూడు లేకపోయినా ఈ కళ కడుపును ప్రదర్శనలతో నింపుతూ ముందుకు నడిపిస్తున్నారు.
Updated on: Mar 17, 2024 | 12:40 PM

పేరణి నృత్యం తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక. కాకతీయుల కాలంలో వినోదాన్ని అందిస్తూ యుద్దాన్ని ఎలా నడపాలో అద్భుతంగా చూపించిన కళాఖండం. ఈ నృత్యాన్ని ఇప్పటికీ చాలా మంది వివిధ వేదికలపై ప్రదర్శిస్తూ తెలంగాణ సంస్కృతిని, కళలను కాపాడుతూ వస్తున్నారు.

తమ కడుపుకు కూడు లేకపోయినా ఈ కళ కడుపును ప్రదర్శనలతో నింపుతూ ముందుకు నడిపిస్తున్నారు. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ పేరణి నృత్యం తెలంగాణ సొత్తు అని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఎన్నో ప్రదర్శనలు చేశారు. కేవలం తెలంగాణలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా అనేక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అద్భుతమైన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కళ గురించి అవగాహన కల్పించడం కోసం ఒక సమూహంగా ఏర్పడి దశదిశలా చాటి చెప్పేందుకు దశాబ్ధాలుగా కృషి చేస్తున్నారు. వారి కష్టాలు, కన్నీళ్లు, త్యాగాలు, ఓర్పు, నేర్పు, కూర్పు నేడు సత్ఫలితాలను ఇస్తోంది.

తెలంగాణ గడ్డపై పుట్టిన పేరణి కళ.. వివిధ ఖండాలు, సముద్రాలు, ఎల్లలు దాటి అమెరికాలో అడుగు పెట్టబోతోంది. చిన్న చినుకుగా ప్రారంభమై కుంటలా ఏర్పడి నిర్విరామ ప్రవాహంతో కూడిన జీవనదిలా ప్రవహించి నేడు సునామీ ఉప్పెనలా విజృంభించింది. తెలంగాణ మారుమూల గ్రామం నుంచి అమెరికాలో ప్రదర్శనలు ఇవ్వడానికి సిద్దమైంది.

న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైట) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 2024, మార్చి 23 శనివారం నిర్వహించనున్నారు. ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూయార్క్ నగరంలో హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వారి పర్యవేక్షణలోని గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో అద్భుతమైన ప్రదర్శన నిర్వహించనున్నారు.

ఈ కళపై శిక్షణ ఇచ్చేందుకు శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు, గురువు పేరణి సందీప్ ఎంతో కాలంగా విశేష సేవలు అందిస్తున్నారు. ఈ అకాడమీలో శిక్షణ పొందిన పేరిణి కిరణ్, పేరిణి రోహిత్, పేరిణి ఇంద్రజ, పేరిణి అభినయ అద్భుతమైన ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా వెలుగులోకి రాని కళ వీరి నిరంతర కృషితో నేడు ప్రపంచ దేశాల్లో ప్రదర్శించేలా చేసింది.




