- Telugu News Photo Gallery Technology photos Instagram testing new feature that can control abuse photos and videos
Instagram: ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి వాటికి చెక్.. అందుబాటులోకి కొత్త ఫీచర్
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న ఈ సోషల్ మీడియా దిగ్గజం రోజురోజుకీ ఫాలోవర్లను పెంచుకుంటూ పోతోంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో కూడా రాజీ పడడంలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది..
Updated on: Apr 12, 2024 | 8:43 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన కంటెంట్‌కు కూడా కొదవలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీడియోలు, ఫొటోల రూపంలో పలువురు నగ్నత్వంతో కూడిన కంటెంట్‌ను కూడా పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇలాంటి కంటెంట్ టీనేజర్లకు చూపించకూడదనే ఉద్దేశంతో ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న వారికి నగ్నత్వానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, అసభ్యకరమైన, హానికరమైన కంటెంట్‌ను కనిపించకుండా చేయడానికి మెషీన్ లెర్నింగ్‌ను కంపెనీ ప్రస్తుతం పరీక్షిస్తోంది.

యూజర్లు ఎవరైనా అవతలి వ్యక్తికి నగ్నత్వంతో కూడిన ఫొటోలను పంపడానికి ప్రయత్నించినప్పుడు, ఒకసారి ఆలోచించండి అని యూజర్లకు ఒక వార్నింగ్ అలర్ట్ వస్తుంది. ఆన్ డివైస్ మెషిన్ లెర్నింగ్ ఇలాంటి కంటెంట్‌ను విశ్లేషిస్తుంది.

కాగా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన కంటెంట్ పెరుగుతోందని, యువత ఎక్కువ ఇలాంటి కంటెంట్‌కు అట్రాక్ట్ అవుతున్నారని యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి కంటెంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఇన్‌స్టా నడుము బిగించింది.

18 ఏళ్లు లోపు యూజర్లకు ఈ ఫీచర్ ఆటోమెటిక్‌గా ఆన్ అవుతుంది. దీంతో వారు అసభ్యకరమైన కంటెంట్‌ను చూడకుండా ఆపొచ్చు. అయితే 18 ఏళ్లు నిండిన వారు ఈ ఫీచర్‌ను మ్యాన్యువల్‌గా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.




