- Telugu News Photo Gallery Stop Eating These 5 Foods to Prevent Heart Attack: Experts Warn Against Clogged Arteries
Heart Attack: ఈ 5 ఆహారాలు తినకపోతే చాలు.. గుండెపోటు రమ్మన్నా రాదు..
ఈ మధ్యకాలంలో గుండెపోట్లు భయపెడుతున్నాయి. చిన్న నుంచి పెద్ద వరకు అందరినీ హార్ట్ ఎటాక్ కబళిస్తుంది. పిల్లలు, యువకులకు గుండెపోటు రావడం కలవరపెడుతుంది. అయితే మన ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్లే గుండె జబ్బులు వేగంగా పెరిగిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం రోజూ తినే కొన్ని ఆహారాలు ధమనులలో పేరుకుపోయి.. గుండెకు హాని కలిగిస్తున్నాయి. గుండెపోటు ప్రమాదాన్ని పెంచే ఈ ఐదు రకాల ఆహారాలను మీ డైట్ నుంచి వెంటనే తొలగించడం అత్యవసరం.
Updated on: Oct 09, 2025 | 12:44 PM

ట్రాన్స్ ఫ్యాట్ ఆహారాలు: ట్రాన్స్ ఫ్యాట్స్ గుండెకు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. సమోసాలు, కచోరీలు, భజియాలు వంటి డీప్-ఫ్రై చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వులు ధమనులలో వాపు, ప్లేక్ ఏర్పడటానికి కారణమవుతాయి. దీంతో ధమనులు ఇరుకుగా, గట్టిగా మారతాయి.

అధిక చక్కెర ఆహారాలు: అధిక చక్కెర తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది ఊబకాయం, మధుమేహానికి మాత్రమే కాక ధమనుల సమస్యలకూ దోహదపడుతుంది. సోడా, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, ఇతర తీపి పానీయాలలో అధికంగా చక్కెర ఉంటుంది. అధిక చక్కెర వల్ల ట్రైగ్లిజరైడ్‌లు పెరుగుతాయి. రక్తపోటు ప్రభావితమవుతుంది. ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇవి ధమనులలో ఫలకాలు పేరుకుపోవడాన్ని ప్రోత్సహిస్తాయి.

అధిక సోడియం ఆహారాలు: ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులకు ప్రధాన కారణమైన అధిక రక్తపోటు వస్తుంది. చిప్స్, స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, డబ్బాల్లో ఉన్న సూప్‌లు, ప్రాసెస్ చేసిన మాంసాలు ఊరగాయల్లో సోడియం అధికంగా ఉంటుంది. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పెరిగి, అవి దెబ్బతింటాయి. దీని కారణంగా ధమనులలో ప్లేక్ పేరుకుపోవడం పెరుగుతుంది.

ఎర్ర మాంసం - పాల ఉత్పత్తులు: ఎర్ర మాంసంలో, పూర్తి కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులలో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. గొర్రె మాంసం, పంది మాంసం, పూర్తి కొవ్వు పాలు, వెన్న, చీజ్ వంటి వాటిలో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వు ధమనుల గోడలకు అంటుకుని, ప్లేక్‌ను ఏర్పరుస్తుంది. ఈ ప్లేక్ పేరుకుపోవడం వల్ల ధమనులు పూర్తిగా అడ్డుపడే ప్రమాదం ఉంది.

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు: శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల శరీరంలోకి చక్కెర చాలా వేగంగా విడుదల అవుతుంది. వైట్ బ్రెడ్, తెల్ల బియ్యం, పాస్తా, శుద్ధి చేసిన పిండి ఉత్పత్తులను తగ్గించడం బెటర్. లేకపోతే ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచి, వాపుకు దారితీస్తుంది. వీటిని ఎక్కువ కాలం తినడం వల్ల ఊబకాయం, ట్రైగ్లిజరైడ్లు పెరగడం, ధమనులు గట్టిపడటం వంటి సమస్యలు వచ్చి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.




