- Telugu News Photo Gallery Sports photos Cristiano ronaldo offered by 14th tier side club record 35 pound per week by in free transfer bid
మొన్నటిదాకా వారానికి రూ. 5 కోట్ల రెమ్మునరేషన్.. కట్‌చేస్తే ఇప్పుడు రూ. 3500.. కొత్త ఆఫర్ చూసి పరేషాన్ అవుతోన్న స్టార్ ప్లేయర్..
Cristiano Ronaldo: ప్రపంచంలోని గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్లలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో.. ప్రస్తుతం ఏ క్లబ్‌తోనూ సంబంధం కలిగి లేడు. దీంతో ప్రస్తుతం ఆయనకు వివిధ క్లబ్‌ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.
Updated on: Nov 24, 2022 | 7:47 PM

పోర్చుగల్ కెప్టెన్, గ్రేట్ ఫుట్‌బాల్ క్రిస్టియానో రొనాల్డో ఫిఫా ప్రపంచ కప్‌లో ఈరోజు అంటే నవంబర్ 24న ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో, రొనాల్డో అతిపెద్ద స్టార్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం తన వృత్తిపరమైన కెరీర్‌లో చెడు రోజులను ఎదుర్కొంటున్నాడు. నిరుద్యోగిగా మారిన రొనాల్డోకు అతనితో చేరడానికి ఓ క్లబ్ ఆఫర్ చేసింది. కాగా, ఈ ఆఫర్ ప్రపంచ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది.

రొనాల్డో గత వారం వరకు మాంచెస్టర్ యునైటెడ్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. అయితే, ఓ వివాదాస్పద ఇంటర్వ్యూ తర్వాత, క్లబ్ అతనితో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. రొనాల్డో ప్రస్తుతం ఏ క్లబ్‌తోనూ అనుబంధించలేదు. ఈ క్రమంలో రొనాల్డో వారానికి రూ.3500ల జీతంతో ఓ క్లబ్‌లో ఆడాల్సినంత చెడ్డ రోజులు వచ్చాయా అంటూ ఆవేదన చెందుతున్నారు.

రొనాల్డోకు FC క్రూ, 14 టైర్ నాన్-లీగ్ క్లబ్ ఆఫర్ చేసింది. ఈ స్టార్ ఆటగాడికి ప్రతి వారానికి 35 పౌండ్లు అంటే దాదాపు 3500 రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. క్లబ్ ప్రకారం, ఇది ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఆఫర్‌గా పేర్కొంది. ఈ మేరకు ఓ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది.

రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ తరుపున ఆడుతున్నప్పుడు, అతనికి ప్రతి వారం ఐదు లక్షల పౌండ్లు అంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు వచ్చేవి. అంతకుముందు రియాల్ మాడ్రిడ్‌లో అతని సంపాదన కూడా కోట్లలో ఉండేది. కేవలం రూ.3500 ఆఫర్‌ని చూసి అభిమానులు నవ్వుకోవడంతోపాటు షాక్‌కు గురవుతున్నారు.

గత కొద్ది రోజులుగా రొనాల్డోకు పరిస్థితులు అంతగా అనుకూలించలేదు. బ్రిటిష్ జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్‌తో వివాదాస్పద ఇంటర్వ్యూ తర్వాత అతను క్లబ్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో అభిమానితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం, 50 వేల డాలర్ల జరిమానా విధించింది. అతను ఇప్పుడు ఏ క్లబ్‌లో చేరుతాడనేది ప్రపంచకప్ తర్వాత నిర్ణయంకానుంది.




