- Telugu News Photo Gallery Spiritual photos The color changing shiva linga temple in bhimavaram in andhra pradesh
Color Changing Shiva Linga: అమావాస్యకు బూడిద రంగులో..పౌర్ణమికి గంధం రంగులో దర్శనమిచ్చే శివుడు..
పంచారామాల్లో ఒకటైన భీమారామం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాల కధనం. అందుకనే ఈ క్షేత్రానికి చంద్రుని పేరుతో.. సోమేశ్వరక్షేత్రంగా ప్రసిద్దిగాంచింది. ప్రతీ కార్తీకమాసంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు.
Updated on: Apr 04, 2021 | 2:49 PM

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పట్టణమైన భీమవరంలో సోమేశ్వరక్షేత్రం ఉంది. ఇక్కడ ఆలయాన్ని చాళుక్య భీములు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది. దేవాలయంలో ఉన్న శివలింగం అమావాస్య రోజున నలుపు వర్ణంలోను, పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలో దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత.

భోళాశంకరుడైన పరమశివుడు ఇక్కడ సోమేశ్వరస్వామి పేరుతో నిత్య పూజలందుకుంటున్నాడు. ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అంతేకాదు.. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయానికి పంచ నందీశ్వరాలయంగా కూడా పేరు. దేవాలయం ముందు భాగంలో రెండు నందులు, ధ్వజస్తంభం వద్ద మరో నంది, ఆలయ ప్రాంగణంలో ఒక నంది. దేవాలయం ఎదురుగా ఉన్న చంద్రపుష్కరిణిలో మరో నంది ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. దేశంలో ఉన్న స్పటికలింగాల్లో ఇది ఒకటి.

స్థల పురాణం ప్రకారం త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కల్లో ఒకటి ఇక్కడ పడింది. అందువల్లనే ఇది పంచారామాలలో ఒకటి అయింది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం

ఇక శ్వేతవర్ణంలో కనిపించే లింగం అమావాస్య వచ్చేసరికి భూడిద వర్ణంలోకి మారిపోతుంది. మళ్ళీ తిరిగి పౌర్ణమి వచ్చే సరికి యదాతధంగా శ్వేతవర్ణములో దర్శనమిస్తుంది. అయితే ఈ లింగం చంద్రశిల అని అందుకనే ఇలా అమావాస్య, పొర్ణమిలకు మార్పులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక ఆలయం లో ఉన్న కోనేరు గట్టున ఉన్న రాతి స్థంభం పై ఉన్న నందీశ్వరు విగ్రహం నుంచి శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది.

ప్రతి ఏడాది ఇక్కడ మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు జరుగుతాయి. అలాగే దేవీనవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇక కార్తీక్ మాసంలో భారీ సంఖ్యలో భక్తులు సోమేశ్వర స్వామిని దర్శించుకుంటారు.




