- Telugu News Photo Gallery Spiritual photos Sirimanotsavam 2024: Major folk festival to be held on October 15
సిరిమానోత్సవానికి వేళాయరా..! ముస్తాబవుతున్న పైడితల్లి అమ్మవారు.. ఈ పండగ విశిష్టత ఏమిటంటే
ఉత్తరాంధ్ర పెద్ద పండుగగా చెప్పుకునే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా అధికారులు. ఈ నెల 15న జరగనున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం కోసం నిపుణులయిన వడ్రంగులు కఠోర దీక్షతో నిరంతరం శ్రమిస్తున్నారు. అరవై అడుగుల పొడువున్న చింతచెట్టును పదమూడు మంది వండ్రంగులు సిరిమానుగా మలుస్తున్నారు.
Updated on: Oct 05, 2024 | 3:54 PM

ఉత్తరాంధ్ర పెద్ద పండుగగా చెప్పుకునే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా అధికారులు. ఈ నెల 15న జరగనున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం కోసం నిపుణులయిన వడ్రంగులు కఠోర దీక్షతో నిరంతరం శ్రమిస్తున్నారు. అరవై అడుగుల పొడువున్న చింతచెట్టును పదమూడు మంది వండ్రంగులు సిరిమానుగా మలుస్తున్నారు.

విజయదశమి తరువాత వచ్చే మొదటి మంగళవారం రోజున అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14వ తేదీన అమ్మవారి తొలేళ్ల ఉత్సవం జరగనుండగా, 15న ప్రధాన ఉత్సవమైన సిరిమాను సంబరం జరగనుంది.

సిరిమాను సంబరానికి అమ్మవారి సిరిమాను రథం పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రతీ ఏడాది అమ్మవారు సుమారు అరవై అడుగుల పొడవైన సిరిమాను పై అధిష్టించి, పురవీధుల్లో ఊరేగుతుంటుంది. దీనినే సిరిమాను సంబరం అంటారు. ప్రధాన అర్చకుడు బంటుపల్లి వెంకట్రావు కలలో అమ్మవారు కనిపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో తన సిరిమాను కోసం కావల్సిన ఎత్తైన చింత చెట్టు ఎక్కడ ఉందో తెలియజేస్తుంది

దీంతో ఆలయ అర్చకుడు, అధికారులు ఆ చింతచెట్టును గుర్తిస్తారు. అనంతరం ఆ చెట్టును తొలగించి విజయనగరం తరలించి సిరిమానుగా మలుస్తారు. ఈ సంప్రదాయం వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది.

ఈ ఏడాది డెంకాడ మండలం తాడివాడ గ్రామంలో చింతచెట్టును గుర్తించారు. దానిని విజయనగరంలోని పూజారి ఇంటి వద్దకు తరలించి, అక్కడ సిరిమానును ముస్తాబు చేస్తున్నారు వండ్రంగులు. ఈ ఏడాది ఈ సిరిమాను పొడవు అరవై అడుగులుగా నిర్థారించారు.

ప్రస్తుతం నిపుణులైన వండ్రంగులు చేతిలో చింతమాను సిరిమానుగా మలిచే ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ నెల 15వ తేదీలోగా పనులు పూర్తిచేసి, అమ్మవారి సిరిమాను జాతరకు సిద్ధం చేస్తున్నారు.

సిరిమానుకు ముందు సంప్రదాయబద్దంగా తిరిగే తెల్ల ఏనుగు, అంజలి రధాలు కూడా ముస్తాబవుతున్నాయి. లక్షలాది మంది భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు.
