- Telugu News Photo Gallery Spiritual photos Srivari brahmotsavam 2024: chinna sesha vahana seva held in tirumala tirupati
Tirumala: చిన్నశేష వాహనంపై మురళీ మనోహరుడిగా శ్రీవారు.. దర్శనంతో కుటుంబంలో శ్రేయస్సు నెలకొంటుందని నమ్మకం
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. కలియుగ వైకుంఠ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న చందంగా ఉంటుంది. ఇక శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుమల క్షేత్ర వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ రోజు ఉదయం స్వామివారు చిన శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ రోజు సాయత్రం హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Updated on: Oct 05, 2024 | 2:41 PM

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై మురళీ కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

స్వామివారి వాహనం ముందు ఏనుగులు, అశ్వాలు కదులుతుండగా.. భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

స్వామివారి వాహనాల్లో ఒకటైన చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది.

చినశేష వాహనంలో ఊరేగుతున్న మురళీ మనోహరుడి రూపంలో ఉన్న స్వామివారిని దర్శించిన భక్తుల కుటుంబలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అంతేకాదు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు తన దేవేరులతో కలిసి హంస వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు బ్రహ్మోత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.





























