Anil kumar poka | Edited By: Janardhan Veluru
Updated on: Feb 06, 2023 | 6:32 PM
శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు 5-2-2023 (ఆదివారం)ఉదయం 11 గంటలకు తిరుమంజన సేవ నిర్వహించారు. నిన్న గరుడ సేవ నిర్వహించిన 18 దివ్యదేశాల ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు.
స్వామివారికి నిన్నటి యాత్ర శ్రమ తీరడం కోసం తిరుమంజనం జరుపుకుంటారు.ఏకంగా 18 రూపాల్లో తిరుమంజనం జరపడం అనేది అరుదు. తిరుమంజనంలో భాగంగా పెరుమాళ్‌కు ముందుగా పెరుగుతో స్నానం చేయించారు, తర్వాత పాలు, తైలం, జలంతో తిరుమంజనం జరిపించారు.
నిత్య కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5:45 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం చిన జీయర్‌స్వామి ఆధ్వర్యంలో అష్టాక్షరీ మంత్రజపం జరిగింది.
భక్తులంతా అరగంటపాటు ధ్యానం చేశారు. ఆ తర్వాత ఆరాధన, సేవాకాలంలో భాగంగా శాత్తుముఱై జరిపించారు. అనంతరం తీర్థ, ప్రసాద గోష్టిలో భక్తులు పాల్గొన్నారు.
భక్తులకు స్వయంగా చినజీయర్ స్వామివారు తీర్థం అనుగ్రహించారు.
సమతా కుంభ్-2023 బహ్మోత్సవాల్లో భాగంగా సకల లోక రక్షకుడికి, సర్వరూప ధారుడికి, సర్వనామ సంకీర్తికి, 108 రూపాలలో చారిత్రాత్మక, అపూర్వ, అద్భుత శాంతి కళ్యాణ మహోత్సవం.. సాయంత్రం 5 గంటల నుంచి ప్రధాన వేదికపై జరుగుతుంది.
కళ్యాణం అంటే మంగళం కలుగజేసేదని అర్థం, సాధారణంగా బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లో రాముడికో కృష్ణుడికో కల్యాణం జరుగుతుంది.
కానీ ఇక్కడ ఒకే వేదికపై శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు 108 దివ్యదేశాల పెరుమాళ్లకు ఒకేసారి శాంతి కల్యాణం జరుగుతుంది.
శ్రీ చినజీయరు స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేడుక జరగనుంది. ఈ కల్యాణాన్ని వీక్షించడం మన పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి.
ఎందుకంటే వారిద్దరూ కలిస్తేనే మనమంతా సంతోషంగా ఉంటాం. ఈ చరాచర సృష్టి నడవాలంటే వారిద్దరూ కలిస్తేనే జరుగుతుంది.
లక్ష్మీ అంటే దయ, భూదేవి అంటే క్షమ ఇద్దరినీ కలుపుకొని అందరినీ రక్షించేందుకు స్వామివారు కళ్యాణం జరుపుకుంటారు. ఈ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల ఆ భగవంతుడు 108 రూపాల్లో మనకి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు.
ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా విష్ణు యొక్క సేనాధిపతి విష్వక్సేనుడికి ఉపచారాలను సమర్పించి, వారి అనుగ్రహాన్ని అక్షత రూపంలో స్వీకరించి వాసుదేవ పుణ్యాహవచనం జరిపిస్తారు.
శ్రీరామానుజాచార్య సమతా కుంభ్-2023 బ్రమ్మోత్సవాలకు సంబంధించిన ప్రత్యేక పూజల ఫొటోస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.