- Telugu News Photo Gallery Spiritual photos Makar sankranti 2024 these zodiac signs will get good luck check details in telugu
Sankranti Astrology: మకరరాశిలోకి రవి గ్రహం.. ఆ రాశుల వారికి సంక్రాంతి నుంచి వృత్తి, ఉద్యోగాల్లో శుభఫలితాలు
జనవరి నెల 15వ తేదీన ధనూ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్న రవి గ్రహం కారణంగా, కొన్ని రాశులవారి జీవితాల్లో తప్పకుండా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. శని క్షేత్రమైన మకరం రవికి శత్రు క్షేత్రమే అయినప్పటికీ, కొన్ని రాశుల వారికి వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.
Updated on: Jan 11, 2024 | 6:29 PM

జనవరి నెల 15వ తేదీన ధనూ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్న రవి గ్రహం కారణంగా, కొన్ని రాశులవారి జీవితాల్లో తప్పకుండా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. శని క్షేత్రమైన మకరం రవికి శత్రు క్షేత్రమే అయినప్పటికీ, కొన్ని రాశుల వారికి వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీన రాశుల వారు ఈ మకర సంక్రమణంతో ఎంతగానో లబ్ధి చెందబోతున్నారు.

మేషం: ఈ రాశికి ఉద్యోగ స్థానమైన మకర రాశిలో రవి ప్రవేశించడం వల్ల తప్పకుండా ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ రంగంలోని వారికి ఈ శుభ ఫలితాలు మరీ ఎక్కువగా ఉంటాయి. ఏ ఉద్యోగులకైనా తప్పకుండా ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంటుంది. అధికారులకు సన్నిహితులు కావడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారదలచుకున్నవారికి ఇది చాలావరకు అనుకూల సమయం.

వృషభం: ఈ రాశికి భాగ్య స్థానమైన మకరంలో రవి ప్రవేశం వల్ల విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు అనేక అవకాశాలు కలిసివస్తాయి. వృత్తి జీవితంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభించడంతో పాటు, కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రయత్నాలు బాగా సానుకూలపడతాయి. తల్లితండ్రుల నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.

కర్కాటకం: ఈ రాశివారికి ధన స్థానాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగపరంగా, ఆర్థికపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ధనపరంగా అన్ని విధాలుగానూ అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక విషయాలకు సంబంధించి మనసులోని కోరికలు నెరవేరుతాయి. శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి కూడా బాగా కలిసి వస్తుంది.

తుల: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో రవి గ్రహ ప్రవేశం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. సర్వత్రా గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు బంధువులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఉద్యోగాలు మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ధనుస్సు: ఈ రాశివారికి భాగ్యాధిపతిగా రవి ధన స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. బాకీలు, బకాయిలు తేలికగా వసూలవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. కోర్టు వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. సంతానం లేనివారికి సంతాన యోగం కూడా ఉంది.

మీనం: ఈ రాశివారికి లాభ స్థానంలో రవి ప్రవేశం వల్ల ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోతుంది. రవి లాభ స్థానంలో ఉన్నవారికి తప్పకుండా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. సంతాన యోగం పడుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. అనారోగ్యం నుంచి కోలుకోవడం ప్రారంభం అవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.



