- Telugu News Photo Gallery Spiritual photos Kuja Gochar in Tula Rashi: Positive Impact on Love and Relationships
Love Astrology: తులా రాశిలో కుజుడు.. ప్రేమలు, పెళ్లిళ్లు సుఖమయం..!
జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడికి చెందిన వృషభ, తులా రాశుల్లో కుజుడు ఉన్నా, కుజుడికి చెందిన మేష, వృశ్చిక రాశుల్లో శుక్రుడు సంచారం చేస్తున్నా శృంగార సంబంధమైన కోరికలు విజృంభించే అవకాశం ఉంటుంది. శృంగార జీవితానికి కారకుడైన శుక్రుడితో కుజుడికి ఏ విధమైన సంబంధం ఏర్పడ్డా కోరికలు విజృంభించడంతో పాటు, అనవసర పరిచయాలకు, అక్రమ సంబంధాలకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ నెల(సెప్టెంబర్) 15 నుంచి అక్టోబర్ 28 వరకు కుజుడు తులా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితం, శృంగార కార్యకలాపాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనూ రాశివారికి 43 రోజుల పాటు జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
Updated on: Sep 16, 2025 | 6:38 PM

మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు సప్తమ కేంద్రంలో సంచారం ప్రారంభించడం వల్ల దాంపత్య జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు, మనస్పర్థలున్నా తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. విహార యాత్రలకు, హనీమూన్లకు అవకాశం ఎక్కువగా ఉంది. జీవిత భాగస్వామి పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి కావడం కానీ జరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ సంచారం వల్ల శృంగార సంబంధమైన ఆలోచనలు బాగా ఎక్కువవుతాయి. ప్రేమ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇదివరకే ప్రేమలో పడినవారి మధ్య సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు, విలాస జీవితానికి బాగా అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల దాంపత్య జీవితం, కుటుంబ జీవితం నిత్యకల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. బంధు వర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. విహార యాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ప్రేమ జీవితం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కన్య: ఈ రాశికి కుటుంబ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల శృంగార సంబంధమైన ఆలోచనలు మోతాదు మించే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు కూడా అవకాశం ఉంది. ప్రేమలో పడడం, ఇప్పటికే ప్రేమలో పడ్డవారు ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవడం వంటివి జరిగే సూచనలున్నాయి. సాధారణంగా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తిని ప్రేమించడం గానీ, పెళ్లి చేసుకోవడం గానీ జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా వృద్ధి చెందుతుంది. దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.

తుల: ఈ రాశిలో కుజుడి సంచారం వల్ల దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి, సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. విహార యాత్రలు, హానీమూన్లు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ జీవితంలో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. శృంగార భావనలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ధనుస్సు: ఈ రాశివారికి లాభ స్థానంలో కుజ సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోయి అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి భారీగా వస్తు లాభాలు కలుగుతాయి. విహార యాత్రల సంఖ్య బాగా పెరుగుతుంది. దాంపత్య జీవితం నల్లేరు మీద బండిలా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.



