ఈ నెల 24 నుంచి అక్టోబర్ 10 వరకు కన్యారాశిలో బుధ సంచారం జరుగుతుంది. కన్యా రాశికి బుధుడికి స్వక్షేత్రమే కాక, ఉచ్ఛ క్షేత్రం కూడా. దీనివల్ల నాలుగు రాశులకు భద్ర మహా పురుష యోగమనే మహా యోగం ఏర్పడుతుంది. పంచ మహా పురుష యోగాల్లో భద్ర మహా పురుష యోగం ఒకటి. ఏ రాశికైనా బుధుడు కేంద్ర స్థానాల్లో, అంటే 1,4,7,10 స్థానాల్లో, ఉచ్ఛ స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు భద్ర మహా పురుష యోగం ఏర్పడుతుంది. ఈ యోగం పొందినవారు తమ తమ రంగాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఆర్థిక నిపుణులు, వ్యాపారులు, బ్యాంకర్లు, ఆర్థిక రంగంలో ఉన్నవారు, లాయర్లు, వృత్తి నిపుణులు, ఆడిటర్లు ఒక వెలుగు వెలుగుతారు. ఈ యోగం ఈ నెల 24వ తేదీ నుంచి మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు వర్తిస్తుంది. వృశ్చికం, మకర రాశుల వారికి భాగ్య యోగాలు పడతాయి.