- Telugu News Photo Gallery Spiritual photos Bhishma Ekadashi 2023 celebrations at antarvedi, annavaram, simhachalam, yadagirigutta
Bhishma Ekadashi: ప్రముఖ ఆలయాల్లో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు.. పోటెత్తిన భక్తులు.. ఈ రోజు పూజ, ఉపాసన నియమాలు మీకోసం
హిందూ పంచాగం ప్రకారం మాఘ మాసం శుక్ల పక్షంలో ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది భీష్మ ఏకాదశి రెండు రోజలు వచ్చింది. నిన్న అంటే.. 31 జనవరి 2023 మంగళవారం మధ్యాహ్నం 2.34 కి ఏకాదశి తిధి మొదలైంది. ఈరోజు మధ్యాహ్నం 3.39 గంటలకు ఏకాదశి తిథి ముగుస్తుంది. సూర్యోదయ తిథిని హిందువులు పరిగణలోకి తీసుకుంటారు కనుక ఈరోజు భీష్మ ఏకాదశి వేడుకలను దేశ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు.
Updated on: Feb 01, 2023 | 9:00 AM

హిందూ పంచాగం ప్రకారం మాఘ మాసం శుక్ల పక్షంలో ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది భీష్మ ఏకాదశి రెండు రోజలు వచ్చింది. నిన్న అంటే.. 31 జనవరి 2023 మంగళవారం మధ్యాహ్నం 2.34 కి ఏకాదశి తిధి మొదలైంది. ఈరోజు మధ్యాహ్నం 3.39 గంటలకు ఏకాదశి తిథి ముగుస్తుంది. సూర్యోదయ తిథిని హిందువులు పరిగణలోకి తీసుకుంటారు కనుక ఈరోజు భీష్మ ఏకాదశి వేడుకలను దేశ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు.

ముఖ్యంగా భీష్మ ఏకాదశి రోజున నరసింహ కల్యాణం జరిపిస్తారు. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం , అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో, సింహాచలం నరసింహ స్వామి ఆలయంలో, యాదగిరి గుట్ట, భద్రాచాలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేకపూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు.

అయితే ఈరోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకం అని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ఈ రోజు పసుపు రంగుకు విశిష్టత ఉంది. లక్ష్మీనరసింహ స్వామి వారికి పసుపు రంగుతో కూడిన పండ్లు, స్వీట్లు స్వామికి ప్రసాదంగా సమర్పించాలి. ఏకాదశి రోజున గోపూజ సకల ఫల దాయకం. గోమాతకు అరటిపండ్లు అందిస్తే అన్నిదోషాలు తొలగిపోతాయి.

భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యునిని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుందని హిందువుల నమ్మకం. భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం.

భీష్మ ఏకాదశి పూజ, ఉపవాస నియమాలు: జయ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానమాచరించాలి. శ్రీ మహా విష్ణువును పూజించాలి. ఈ రోజు విష్ణుసహస్ర నామం చదువుకున్నా విన్నా మంచిది. పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం"ఓం నమోనారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి.

దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.

భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. అభ్యంగ స్నానం చేసి.. పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి. ఈ నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు ఉంటుంది. రోజంతా ఉపవాసం పాటించి సంధ్యా సమయంలో పండ్లు తిని.. మర్నాడు అంటే ఫిబ్రవరి 2న ద్వాదశి రోజు స్నానమాచరించి దేవుడికి నమస్కరించి ఉపవాస వ్రతాన్ని విరమించాలి.

భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనులు: మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాయధాన్యాలు వంటి వాటికీ దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి. ద్వాదాశి వరకు బ్రహ్మచర్యను సంయమనంతో పాటించాలి. ఏకాదశి రోజున.. ఇంటిని శుభ్రం చేసుకోకుడదు. ఎందుకంటే చీమలు, పురుగులు వంటి చంపే అవకాశం ఉంటుంది.

తెల్లవారు జామునే నిద్ర లేచి.. సాయంత్రం వరకు నిద్రపోకూడదు. ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ.. రాత్రంతా జాగరం చేయాలి. జుట్టు కత్తిరించకూడదు. ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. విష్ణు సహస్రనామాలు, భగవద్గీతను పఠించడం మంచింది. పేదవారికి, ఆకలి అన్నవారికి ఈరోజు అన్నం పెట్టడం పుణ్యంగా పరిగణింపబడుతున్నది.




