Growing Plants in Space: అంతరిక్షంలో వ్యోమగాముల కోసం వ్యవసాయం.. నాసాతో చేతులు కలిపిన హెచ్‌సీయూ..
Growing Plants in Space: భవిష్యత్‌లో వ్యోమగాములు తమకు కావాల్సిన కూరగాయలు, ఆహార పదార్థాలను అక్కడే సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Updated on: Mar 26, 2021 | 4:31 AM

అంతరిక్షంలో వ్యోమగాములు సాధారణంగా తమకు కావాల్సిన ఆహార పదార్థాలను భూమి నుంచే తీసుకెళ్తుంటారు. కానీ భవిష్యత్తులో ఆ అవసరం ఉండబోదు. వ్యోమగాములు తమకు కావాల్సిన కూరగాయలు, ఆహార పదార్థాలను అక్కడే సాగుచేసుకోవచ్చు.

అంతరిక్షంలో వ్యవసాయానికి సంబంధించి నాసాతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధనలను సాగిస్తున్నది. ఇందులో భాగంగా వనరులు తక్కువగా ఉన్న ప్రతికూల ప్రదేశాల్లో మొక్కలు పెరగడానికి ఉపయోగపడే జన్యువులను కలిగి ఉన్న పలు రకాల బ్యాక్టీరియాలను వారు ఆవిష్కరించారు.

అంతరిక్షంలోనే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొనేందుకు గల సాధ్యాసాధ్యాలపై కొంత కాలంగా పరిశోధనలు సాగుతున్నాయి. నాసాకు చెందిన జెట్ ప్రొపల్సన్ ల్యాబోరేటరీ (జేపీఎల్), అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్), వర్సిటీ ఆఫ్ హైదరాబాద్, స్కూల్ ఆఫ్ సైన్సెన్స్ సంయుక్తంగా విస్తృత అధ్యయనం చేస్తున్నాయి.

ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు నాలుగు కొత్త బ్యాక్టీరియాలను కనుగొన్నారు. ఇందులో ఒకటి మిథైలో బ్యాక్టిరాయాసీ కుటుంబానికి చెందినదిగా గుర్తించగా, మిగతా మూడింటిని గతంలో ఎవరూ కనుగొనలేదని తేల్చారు. వాటిని జన్యు విశ్లేషణచేయగా అవి మిథైలో బ్యాక్టీరియం ఇండికమ్‌తో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నట్టు గుర్తించారు.

కొత్త జాతి బ్యాక్టీరియాలకు అన్నామలై వర్సిటీకి చెందిన విశ్రాంత, ప్రఖ్యాత భారతీయ జీవవైవిధ్య శాస్త్రవేత్త డాక్టర్ అజ్మల్‌ఖాన్ పేరుతో ‘మిథైలో బ్యాక్టీరియం అజ్మాలి’ అని పేరు పెట్టారు.

Space Agriculture 6

ఆ బ్యాక్టీరియాల్లోని జన్యువులు ఒత్తిడితో కూడిన పరిస్థితులను తట్టుకోవడానికి మొక్కలకు సహాయపడటమేకాకుండా, ఇంధనాన్ని రూపొందించడంలోనూ ఎంతో దోహదపడతాయని కనుగొన్నట్టు హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ అప్పారావు పొదిలె వివరించారు.

అంతరిక్షంలో వ్యవసాయం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఇది మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు. జేపీఎల్ సహకారంతో ఆ దిశగా మరింత లోతైన పరిశోధనలు సాగిస్తున్నామని చెప్పారు.




