- Telugu News Photo Gallery Political photos Mim chief asaduddin owaisi warning ys jagan on bjp in andhra pradesh 2
Asaduddin Owaisi : జగన్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్.. ఏపీ రాజకీయాల్లో కొత్త కలకలం
Asaduddin Owaisi : ఏపీలో జరుగుతోన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగడం ద్వారా ఎంఐఎం తన బేస్ ను విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టింది..
Updated on: Mar 07, 2021 | 12:16 PM

రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన దరిమిలా ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూడని ఎంఐఎం ఇప్పుడు దృష్టి సారించింది. అంతేకాదు, వస్తూ వస్తూనే సంచలన ప్రకటనతో రాజకీయం షురూ చేశారు ఆపార్టీ అధిపతి అసదుద్దీన్ ఒవైసీ.

ఇటీవలే 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొన్న 'ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' పార్టీ.. పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా, ఇన్నేళ్ల తర్వాతగానీ ఆంధ్రప్రదేశ్ పై పట్టుకోసం ప్రయత్నాలు ప్రారంభించకపోవడం విశేషం.

తాజాగా ఏపీలో జరుగుతోన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగడం ద్వారా ఎంఐఎం తన బేస్ ను విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ క్రమంలో సహజంగానే బీజేపీతోపాటు అధికార వైసీపీనీ మజ్లిస్ టార్గెట్ చేసింది.

సంచలనాలకు కేంద్రంగా ఉండే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.. ఏపీ సీఎం జగన్ పై, వైసీపీ కీలక నేతలపై తీవ్ర కామెంట్లు చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు.

'జగన్... జాగ్రత్త.... బీజేపీ తరుముకొస్తోంది' అంటు హెచ్చరించారు అసదుద్దీన్ ఓవైసీ. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ సూచనలు చేశారు ఎంఐఎం చీఫ్. వైసీపీ మేల్కోకుంటే భారీ ముప్పు తప్పన్నారు. ఎంఐఎం తరఫు పోటీ చేస్తున్న 9 మందిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఆలయాలపై దాడులు కూడా కొందరు హిందుత్వవాదుల పనిగానే ఓవైసీ అనుమానించారు. బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ అధినేతను ఇంటికే పరిమితం చేయడం ద్వారా టీడీపీని తుదముట్టించాలని కూడా బీజేపీ చూస్తోందని అసద్ వ్యాఖ్యానించారు.

అసదుద్దీన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వీటిపై రాజకీయవర్గాల్లోనే కాదు, ఏపీ ప్రధాన రాజకీయపార్టీల్లోనూ ఈ వ్యాఖ్యలపై చర్చ కొనసాగుతోంది.