- Telugu News Photo Gallery Police seize shed making Low quality Chocolates in Rajendra Nagar, Hyderabad
Hyderabad: తల్లిదండ్రులకు అలెర్ట్.. మీ పిల్లలకు చాక్లెట్స్ కొనిస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే వణికిపోవాల్సిందే..
చాక్లెట్లు, లాలీ పాప్స్‌ను చిన్న పిల్లలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఎక్కడైనా కనిపిస్తే చాలు.. కొనేంత వరకూ ప్రాణం తీస్తుంటారు. పిల్లలు బాగా మారాం చేస్తున్నారు కదా అని మనం కూడా వాటిని కొంటుంటాం. కానీ.. ఇప్పుడవే చాక్లెట్లు, లాలీ పాప్స్ వారి ప్రాణాలు తీసేలా చేస్తున్నాయి. అదేంటి.. చాక్లెట్లు, లాలీపాప్ప్ తింటే ప్రాణాలు పోవడం ఏంటా అనుకుంటున్నారా.. అవును మీరు విన్నదే నిజమే.
Updated on: Apr 13, 2023 | 1:54 PM

చాక్లెట్లు, లాలీ పాప్స్‌ను చిన్న పిల్లలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఎక్కడైనా కనిపిస్తే చాలు.. కొనేంత వరకూ ప్రాణం తీస్తుంటారు. పిల్లలు బాగా మారాం చేస్తున్నారు కదా అని మనం కూడా వాటిని కొంటుంటాం. కానీ.. ఇప్పుడవే చాక్లెట్లు, లాలీ పాప్స్ వారి ప్రాణాలు తీసేలా చేస్తున్నాయి. అదేంటి.. చాక్లెట్లు, లాలీపాప్ప్ తింటే ప్రాణాలు పోవడం ఏంటా అనుకుంటున్నారా.. అవును మీరు విన్నదే నిజమే.

చాక్లెట్స్, లాలీ పాప్స్ తయారీలో ప్రమాదకర రసాయనాలను కలుపుతూ పిల్లల అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నారు కొందరు నకిలీ చాక్లెట్స్ కేటుగాళ్లు. ఆ చాక్లెట్స్, లాలీపాప్స్ పిల్లలకు కొనిచ్చామంటే.. మనమే వాళ్లకు అనారోగ్యాన్ని కొనిచ్చినవాళ్లం అవుతాం.. హా.. ఇక్కడ కాదుగా.. మనకెందుకులే.. అనుకోకండి.. ఎందుకంటే.. అవి ఎక్కడో తయారు చేయడం లేదు.. మన హైదరాబాద్‌లోనే తయారీ చేస్తున్నారు. నకిలీ చాక్లెట్లు, లాలీపాప్స్ తయారు చేస్తున్న కేంద్రాన్ని రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు గుర్తించారు.

సిట్రిక్ యాసిడ్ పౌడర్, చక్కెర, ఇతర కెమికల్స్ కలిపి వివిధ పేర్లతో నకిలీ చాక్లెట్లు, లాలీపాప్స్, పిప్పరమెంట్స్ తయారు చేసి.. వాటిని అందంగా ప్యాక్ చేసి బేగంబజార్‌లోని హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అయితే.. అవేమీ తెలియని మనం.. పిల్లలు అల్లరి చేయగానే చాక్లెట్స్, లాలీపాప్స్ కొనిస్తున్నాం.. తక్కువ ధరతోపాటు.. అందంగా బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ వేసి ఉండడంతో పిల్లలు అడగ్గానే ఠక్కున కొంటున్నాం. కానీ.. వాటిని వేటితో తయారు చేస్తున్నారో.. ఎలాంటి పరిస్థితుల్లో తయారు చేస్తున్నారో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే. ఓ షెడ్‌లో ఈగలు, దోమలు, పురుగులు పడిన పానకంతోనే తయారు చేస్తుండడం చూసి పోలీసులు, అధికారులే విస్తుపోయారు.

సులేమాన్‌నగర్‌లోని నకిలీ చాక్లెట్స్, లాలీపాప్స్ పరిశ్రమపై దాడి చేసిన రాజేంద్రనగర్ పోలీసులు.. అహ్మద్ అనే వ్యక్తితోపాటు అక్కడ పనిచేస్తున్న కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. పెద్దయెత్తున చెక్కర, రసాయనాల బాటిళ్లు, రంగు డబ్బాలు, డ్రమ్ముల్లోని గ్లూకోజ్ లిక్విడ్, సిట్రిక్ యాసిడ్ పౌడర్, ఆరెంజ్ లిక్విడ్ ప్లేవర్, బెస్ట్ పాలిష్ పౌడర్, మిక్సింగ్ మిషిన్, స్వీట్ ఆయిల్ లాంటి కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సులేమాన్‌నగర్‌కు చెందిన అహ్మద్ రెండేళ్ల నుంచి అదే ప్రాంతంలో ఎంకే స్వీట్స్ పేరిట చిన్న షెడ్‌లో పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.

అయితే.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇలాంటి గోదాంలు ఇంకా ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వాటిని గుర్తించి, చిన్నపిల్లల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర నగర్ సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సయ్యద్ సిరాజ్ అహ్మద్ టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజేంద్రనగర్ సర్కిల్ లో ఓ రేకుల షేడ్ లో నాణ్యతలేని చాక్లెట్స్ తయారు చేస్తున్నారన్నారు. వీరికి లైసెన్స్ కూడా లేదని.. మార్చి నెలలో వీరి లైసెన్స్ గడువు పూర్తయినట్లు తెలిపారు.

గడువు పూర్తయిన తర్వాత ఒక్కరోజు కూడా చాక్లెట్స్ తయారీలు చేయకూడదని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చాక్లెట్స్ కి సంబంధించిన శాంపిల్స్ సేకరించామని.. చాక్లెట్స్ తయారీలో ఎక్కువగా ఫుడ్ కలర్ ను వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఫుడ్ కలర్ 100 పి పి మించి వినియోగించరాదన్నారు. ఎటువంటి గ్లౌజెస్ శుభ్రతను పాటించకుండా చాక్లెట్స్ తయారు చేస్తున్నారన్నారు. ఇలా చేస్తే పూర్తిగా నాణ్యతలేని చాక్లెట్స్ ను తయారు చేయడమేనని.. కానీ.. ఇవి నకిలీ చాక్లెట్స్ అనడానికి రిపోర్ట్స్ రావాలన్నారు. ఈ చాక్లెట్స్ ఎక్కువ మోతాదులో తినడం వలన క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నారు. మొత్తం 6గురు వ్యక్తులు కలిసి ఈ చాక్లెట్ దందా నడుపుతున్నట్లు గుర్తించామన్నారు.
