- Telugu News Photo Gallery PM Modi releases 109 climate resilient seed varieties to boost farm yield, nutrition
PM Modi: రైతులకు గుడ్ న్యూస్.. 109 రకాల పంటల వంగడాలను విడుదల చేసిన ప్రధాని
దేశంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతన్నల ఆదాయాన్ని పొంపొందించడమే లక్ష్యంగా 109 రకాల పంటల వంగడాలను విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో వీటిని విడుదల చేశారు. ఇంతకీ ఈ వంగడాల ఉపయోగం ఏంటి.? వీటివల్ల రైతులకు ఎలాంటి లాభం జరగనుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 11, 2024 | 2:50 PM

వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సరికొత్త విత్తనాలను విడుదల చేశారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల్లో అధిక దిగుబడినిచ్చే, రకరకాల వాతావరణల పరిస్థితిని తట్టుకునేలా ఈ బయోఫోర్డిఫైడ్ విత్తనాలను తయారు చేశారు.

ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అధిక దిగుబడినిచ్చే 109 రకాల పంటల వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేశారు. 109 రకాల వంగడాలలో 61 పంటల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలు ఉన్నాయి.

ఈ విత్తనాల్లో.. పొలాల్లో పండే పంటల విషయానికొస్తే.. మినుము, నూనెగింజలు, చిక్కుడు, చెరకు, పత్తి సహా ఇతర పంటలు ఉన్నాయి. అలాగే ఉద్యాన పంటల విషయానికొస్తే, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ పంటలు ఉన్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ రైతులతో పాటు శాస్త్రవేత్తలతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని వారితో పలు అంశాలపై చర్చించారు. ఇక షకాహార లోపం లేని భారతదేశాన్ని రూపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల వంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ద్వారా బయో ఫోర్టిఫైడ్ రకాల పంటలను ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దీంతో రైతులకు మంచి ఆదాయం రావడంతోపాటు పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు లభిస్తాయని కేంద్రం అంచానవేస్తోంది.




