- Telugu News Photo Gallery Papaya for Digestion: Beat Bloating With Papaya, This Fruit Is Best For Digestive Health
Papaya for Digestion: అజీర్తి నుంచి తక్షణ ఉపశమనం పొందాలా? ఈ పండు ముక్కలు కాసిన్ని తింటేసరి
అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, బయటి ఆహారం ఎక్కువగా తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తుతుంది. సాధారణ గ్యాస్-గుండె మంటతో కడుపులో విపరీతమైన నొప్పి బాధిస్తుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. యాంటాసిడ్లు ప్రతిసారీ తీసుకోలేం. ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందాలంటే పండిన బొప్పాయిని తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు..
Updated on: Jul 19, 2024 | 12:45 PM

అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, బయటి ఆహారం ఎక్కువగా తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తుతుంది. సాధారణ గ్యాస్-గుండె మంటతో కడుపులో విపరీతమైన నొప్పి బాధిస్తుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. యాంటాసిడ్లు ప్రతిసారీ తీసుకోలేం. ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందాలంటే పండిన బొప్పాయిని తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పండిన బొప్పాయిని రోజూ తింటే ఎలాంటి హాని జరగదు. బదులుగా ఈ పండు ఏవైనా జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే ఉపశమనం కలిగిస్తుంది. పండిన బొప్పాయి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పండిన బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్‌లను చిన్న పెప్టైడ్‌లు, అమైనో ఆమ్లాలుగా విభజించడంలో సహాయపడుతుంది. ఇవి ఆహారం సులభంగా జీర్ణమై పోషకాలను శరీరం గ్రహించేందుకు ఉపయోగపడతాయి.

పండిన బొప్పాయిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఈ పండులో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి పోషకాలు అధికమొత్తంలో ఉంటాయి. ఈ పండు మలాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. తద్వారా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పండిన బొప్పాయిలో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీర్ణాశయంలో మంటను తగ్గించి, అల్సర్, గ్యాస్ట్రైటిస్ వంటి వ్యాధులను నివారిస్తాయి. పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.

పండిన బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను హైడ్రేట్ గా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి హైడ్రేషన్ చాలా అవసరం. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో, దాని నుంచి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. బొప్పాయికి ఆల్కలీన్ స్వభావం ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ స్థాయిలను సాధారణీకరించడంలో సహాయపడుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, గొంతు చికాకు వంటి సమస్యలను నివారిస్తుంది.

పండిన బొప్పాయిలో కోలిన్, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలుగా పనిచేస్తాయి. పండిన బొప్పాయి తినడం వల్ల పేగు మంట తగ్గుతుంది. అదనంగా అనేక వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.




