Shaik Madar Saheb |
Updated on: May 08, 2022 | 9:01 PM
Morning Diet Tips: చాలా మంది పోషకాల లోపంతో సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని ఆహారాలను తీసుకుంటే పోషకాహార లోపం నుంచి బయటపడొచ్చు. రోజును ఎలా గడుపుతారనేది ఉదయం.. తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. దైనందిన జీవితంలో అల్పాహారం చాలా ముఖ్యమైనది. ఇది మీ రోజును ఉత్సాహంగా ఉంచుతుంది. దీన్ని క్రమంగా తీసుకోకపోతే శరీరంలో శక్తిని కోల్పోతారు. ఇలాంటి సమయంలో ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తీసుకుంటే.. మరింత శక్తి లభించడంతోపాటు శరీరంలో పోషకాల లోపం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. అవి ఏమిటో చూద్దాం...
ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కల్పించడంలో సహాయపడుతుంది. అంతేకాదు అజీర్తి, విరేచనాలతో బాధపడేవారు కూడా ఖాళీ కడుపుతో ఖర్జూరాన్ని తినడం మంచిది. ఎండు ఖర్జూరాలను ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం లేచి తినండి.
రాత్రి పడుకునే ముందు 4 బాదం పప్పులను నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే తినండి. బాదం గింజలు గుండె జబ్బులు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను కూడా దూరంగా ఉంచుతాయి.
అల్పాహారంలో బొప్పాయి తినడం చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అదనంగా, ఈ పండు చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే.. ఈ రోజు నుంచి బొప్పాయి పండును తినడం ప్రారంభించండి.
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల శరీరంలోని అనేక రుగ్మతలు దూరమవుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
బరువు తగ్గడానికి చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటిలో తేనె కలిపి తాగుతుంటారు. ఇది ఆరోగ్యకరమైన అలవాటు. దీనివల్ల బరువు తగ్గడంతో పాటు, తేనె జీవక్రియ రేటును పెంచుతుంది. అంతేకాదు, ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగించే పదార్ధం తేనె.
మీరు PCOD లేదా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటే.. రాత్రి పడుకునే ముందు కొంచెం జీలకర్రను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే లేచి ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. ఇది శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. అదనంగా ఇది మీ జీర్ణశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా బరువును తగ్గిస్తుంది.